రేవంత్ అమెరికా పర్యటన రద్దు, కేంద్రం బ్రేక్..? తిరిగి వెనక్కు, అసలు కారణం..!!
సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు.. సమావేశాల కోసం సీఎం రేవంత్ యూకే, అమెరికా పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం లో పాల్గొన్న రేవంత్.. ఆ తరువాత యూకే వెళ్లారు. అక్కడ పర్యటన పూర్తి చేసుకొని అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు సమావేశాలు సైతం ఫిక్స్ అయ్యాయి. కాగా, రేవంత్ ఇప్పుడు ఆకస్మికంగా అమెరికా పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. తిరిగి హైదరాబాద్ వస్తున్నట్లు చెబుతున్నారు. అసలు కారణం పైన అధికారులు స్పష్టత ఇస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ విదేశీ పర్యటన అర్ధాంతరంగా రద్దయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూకే లో ఉన్న రేవంత్.. అటు నుంచి అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే, అమెరికా పర్యటనకు సాంకేతికంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. అమెరికాలో ఆయన పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడమే కారణంగా తెలుస్తోంది. చివరి నిమిషంలో కేంద్ర అనుమతి వస్తే ఆయన పర్యటన కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.

అయితే, ఇప్పటి వరకు అనుమతి లేకపోవటంతో తిరిగి ఆదివారం రేవంత్ హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది. సహజం గా దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం విదేశాలకు వెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వం (ప్రధాని, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక శాఖల) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
కేంద్రం అనుమతి రాక తిరిగి హైదరాబాద్ కు
ఏవైనా అవాంఛనీయ, ప్రత్యేక పరిస్థితులు నెలకొంటే తప్ప.. సీఎం కార్యాలయం కోరగానే కేంద్రం నుంచి అనుమతులు మంజూరు అవుతాయి. ఈ క్రమంలో ఈనెల 20 నుంచి 29వ తేదీ వరకు బ్రిటన్, అమెరికా దేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కోసం కేంద్రం అనుమతి కోరుతూ తెలంగాణ సీఎంవో లేఖ రాసింది. అందులో బ్రిటన్ పర్యటనకు కేంద్రం అనుమతి లభించింది. దీంతో బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ లండన్‌కు వెళ్లారు.
కాగా, షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం(23న) లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్‌కు సీఎం వెళ్లాల్సి ఉంది. కానీ గురువారం అర్ధరాత్రి వరకూ కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో.. రేవంత్ లండన్ పర్యటన ముగియగానే హైదరాబాద్ తిరిగి రానున్నారు. కేంద్రం అనుమతి ఇవ్వాలనుకుంటే.. ఈ రోజు (శుక్రవారం) ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే.. రేవంత్ తిరిగి వెనక్కు రానున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications