మారుతున్న పవన్ 'స్థానిక' రాజకీయం - పొత్తుల లెక్కల్లో కొత్త ఫార్ములా..!!
ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల కోసం కూటమి పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. మూడు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. అక్టోబర్ నెలాఖరు నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల అమలు జీవో జారీ అయింది. అటు వైసీపీ సైతం సై అంటోంది. ఈ సమయంలో పవన్ నిర్ణయాలు ఆసక్తి కరంగా మారాయి. కొత్త రాజకీయం మొదలైంది. పొత్తుల లెక్కల్లో కొత్త ఫార్ములా ముందుకొచ్చింది.
స్థానిక ఎన్నికల్లో జనసేన వైఖరి మారింది. ఇప్పటి వరకు పవన్ రాజకీయంగా రాజీ పడుతున్నారు అనే ప్రచారానికి చెక్ పెట్టేందుకు సిద్దమైంది. అందులో భాగంగా స్థానిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు కు 2024 నాటి ఫార్ములా వర్తించదని పవన్ తేల్చి చెప్పారు. ఆ ఎన్నికల్లో జనసేన 21 స్థానాలకు మాత్రమే పోటీ చేసింది. అన్నింటా గెలిచింది. నాడు గెలుపే లక్ష్యంగా.. కూటమి లో సర్దుబాటులో భాగంగా అంగీకరించామని చెబుతున్నారు.

ఆ వ్యూహం ఆ సార్వత్రిక ఎన్నికలకే పరిమితమని స్పష్టం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల కు ప్రాంతాలవారీగా... ఆ ప్రాంత రాజకీయ, సామాజిక పరిస్థితుల ఆధారంగా వ్యూహాలు ఉంటాయని వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో జనసేన ప్రభావ శీలంగా, మెరుగైన స్థాయిలో నిలబడుతుందని ప్రకటించారు. ప్రతి ఎమ్మెల్యే నుంచి వారివారి నియోజకవర్గాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
జనసైనికుల ఆత్మగౌరవం నిలబెట్టేలా నిర్ణయాలు
స్థానిక ఎన్నికల కోసం పవన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎంతమంది అభ్యర్థులు సంసిద్ధంగా ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలకే పరిమితం కాకుండా సమీప ప్రాంతాల్లో జనసేన బలాబలాలను బేరీజు వేసి, పోటీ చేసేందుకు తగిన స్థానాలను గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సంసిద్ధులు కావాలని, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల బరిలోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన ఎంత బలంగా నిలబడితే అంత మెరుగైన ఫలితం ఉంటుందన్నారు.
స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరిం చాల్సిన విధివిధానాల రూపకల్పనకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జనసేన ఎమ్మెల్యేలు లేని కొన్ని ప్రాంతాల్లో కూటమి ధర్మానికి భిన్నంగా వెళ్తుండడంపై శ్రేణుల్లో అసహనం ఉందని పలువురు ఫిర్యాదు చేశారు. అవి తన దృష్టిలో ఉన్నాయని చెప్పారు. జనసైని కుల ఆత్మగౌరవం తగ్గకుండా స్థానిక ఎన్నికల్లో నిర్ణయం ఉంటుందని పవన్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు పొత్తుల లెక్కల పైన ఆసక్తి నెలకొంది.














Click it and Unblock the Notifications