హైదరాబాద్ నుంచి మరో వ్యాక్సిన్: 30 కోట్ల డోసులకు ‘బయోలాజికల్ ఇ’తో కేంద్రం రూ. 1500 కోట్ల డీల్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందేకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కోసం పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా, హైదరాబాద్ నగరంలోని ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్(బీఈ)తో కరోనా వ్యాక్సిన్ల కోసం భారీ ఒప్పందం కుదుర్చుకుంది.
Recommended Video

30 కోట్ల డోసుల కోసం రూ. 1500 కోట్ల డీల్
బయోలాజికల్ ఇ నుంచి 30 కోట్ల టీకా డోసుల కోసం గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇందుకు గానూ కేంద్ర ప్రభుత్వం రూ. 1500 కోట్లు అడ్వాన్స్ అందించనుంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కాలంలో టీకా డోసులను బయోలాజికల్ ఇ సంస్థ తయారు చేసి, నిల్వ చేస్తుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

స్వదేశీ టీకాల తయారీని ప్రోత్సహించేందుకే..
పరిశోధన, అభివద్ధి, వ్యయపరంగా సహాయం అందించి స్వదేశీ టీకాలను ప్రోత్సహించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ ఒప్పందమని కేంద్రం తెలిపింది. ఇక ఆర్థిక సాయం కోసం బయోటెక్నాలజీ విభాగం ఔషధ సంస్థకు రూ. 100 కోట్లు అందించిందని తెలిపింది. పలు అధ్యయనాల నిమిత్తం ఈ రెండింటి మధ్య ఒప్పందం ఉంది. రాబోయే నెలల్లోనే ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. కోవాగ్జిన్ తర్వాత అందుబాటులోకి వస్తున్న మరో దేశీయ టీకా ఇదే కావడం గమనార్హం. బయోలాజికల్ ఇ అభివృద్ధి కరోనా టీకా మొదటి రెండు దశల్లో మెరుగైన ఫలితాలను సాధించింది. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

హైదరాబాద్ నుంచి రెండో కరోనా వ్యాక్సిన్.. కీలక ఒప్పందాలు
అమెరికాకు చెందిన బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి బయోలాజికల్ ఇ సంస్త కరోనా టీకాను అభివృద్ధి చేసింది. దీంతో భాగంగా మూడో దశ ట్రయల్స్ కోసం నెల రోజుల క్రితం సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్జనైజేషన్(సీడీఎస్ఈఓ) అనుమతి పొందింది. ఇది ఇలావుంటే, జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన టీకాను మనదేశంలో ఉత్పత్తి చేయడానికీ బయోలాజికల్ ఇ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కెనడా సంస్థ ప్రావిడెన్స్ థెరప్యూటిక్స్ కు చెందిన ఎంఆర్ఎన్ఏ టీకాను మనదేశానికి తీసుకురావడానికి, ఆ టీకాను ఇక్కడ ఉత్పత్తి చేయడానికి కూడా ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా, కేంద్రం ఈ సంస్థతో భారీ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. ఇప్పటికే హైదరాబాద్ నగరానికే చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications