ట్రంప్ కు మోడీ బిగ్ షాక్ ? ఆపరేషన్ సింధూర్, సీజ్ పైర్ లో పాత్రపై క్లారిటీ ..!
కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, అలాగే ఆ తర్వాత తీసుకున్న కాల్పుల విరమణ నిర్ణయాల వెనుక అమెరికా ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే భారత్-పాక్ యుద్దం ఆపానని, వీరిద్దరితో సుదీర్ఘంగా చర్చించాక కాల్పుల విరమణకు అంగీకరించారని గతంలో ట్వీట్ చేశారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఈ విషయంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీతో జరిగిన భేటీలో ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత తీసుకున్న కాల్పుల విరమణ నిర్ణయాలపై కేంద్రం తరఫున విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇవాళ క్లారిటీ ఇచ్చారు. ఈ కమిటీకి కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తున్న ఎంపీ శశిథరూర్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీకి ఇచ్చిన వివరణలో కేంద్రం ఆపరేషన్ సింధూర్ లో కానీ, కాల్పుల విరమణలో కానీ అమెరికా పాత్ర ఏమీ లేదని తేల్చిచెప్పేసింది. దీంతో ట్రంప్ తో పాటు విపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది.

పహల్గాం దాడికి కౌంటర్ గా ఆపరేషన్ సింధూర్ ను తామే చేపట్టామని, అలాగే కాల్పుల విరమణకు మాత్రం పాకిస్తాన్
డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ నుండి విజ్ఞప్తి వచ్చిందని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఆయన ఢిల్లీలోని మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ను సంప్రదించి కాల్పుల విరమణ కోరినట్లు వెల్లడించారు. పాక్ డీజీఎంఓ ఫోన్ కాల్ తర్వాత మే 12న భారత్, పాకిస్తాన్ యుద్ధాన్ని విరమించుకునేందుకు అంగీకరించాయన్నారు.
అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సంప్రదించి కాల్పుల విరమణకు భారత్ ను కోరాలని సూచించినట్లు తెలుస్తోంది. అందుకే ట్రంప్ ఆ తర్వాత పదే పదే తానే యుద్ధాన్ని విరమింపజేసినట్లు చెప్పుకుంటున్నట్లు కేంద్రం భావిస్తోంది. వాణిజ్యాన్ని అడ్డుపెట్టి ఇరుదేశాల్ని కాల్పుల విరమణకు అంగీకరింపజేసినట్లు ట్రంప్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. అయితే పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు తాము ఎలాంటి వాణిజ్య ప్రయోజనాలను కోరలేదని కేంద్రం ఇవాళ పార్లమెంట్ కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications