Parliament : లోక్ సభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు-వ్యతిరేకించిన విపక్షాలు
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. ఇందులో భాగంగా ఇవాళ కీలక అడుగు వేసింది. ఎన్నికల సంస్కరణలకు ఉద్దేశించిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ను కేంద్రం ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీంతో పలు ప్రయోజనాలన్నట్లు కేంద్రం చెబుతోంది.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న ఎన్నికల చట్టాల్లో సవరణ చేస్తూ కీలకమైన బిల్లును న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఓటరు జాబితాను ఆధార్ నంబర్‌కు లింక్ చేయడానికి ఉద్దేశించిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లుపై మధ్యాహ్నం సభలో చర్చ జరగనుంది. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు దరఖాస్తుదారు గుర్తింపును నిర్ధారించడానికి ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే దరఖాస్తుదారుల ఆధార్ నంబర్లను తీసుకునేందుకు వీలుగా ఈ బిల్లు తీసుకొస్తున్నారు.
ఓటర్ల జాబితాలో ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదైన ఎంట్రీల్ని తొలగించేందుకు వీలుగా వాటిని ఆధార్ తో లింక్ చేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా ఎన్నికల విధానం పారదర్శకమవుతుందని భావిస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాలో చేర్చబడిన వ్యక్తుల నుంచి నంబర్‌ను అడగడానికి మరియు ఒకటి కంటే ఎక్కువ మంది ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తి పేరు నమోదును గుర్తించడానికి అధికారులను అనుమతించాలని కూడా ఈ బిల్లు కోరుతోంది.

న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, 2021ని ప్రవేశపెట్టడానికి ముందుకు రాగానే.. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, వ్యతిరేకించారు. ఇది గోప్యతా హక్కును ఉల్లంఘిస్తుందని, బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని కోరారు. డేటా భద్రత బిల్లు లేకుండా ప్రభుత్వం ఈ బిల్లును తదీసుకురావడం చట్ట ఉల్లంఘన అని ఆయన పేర్కొన్నారు. మరో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే విషయంలో ఓవైసీ డివిజన్ ఓటు కోరినా స్పీకర్ అనుమతించలేదు.
ఆధార్ చట్టం ఆధార్, ఓటర్ ఐడీ లింక్‌ను అనుమతించదని, సంక్షేమ పథకాల కోసం మాత్రమే ఆధార్‌ను ఉపయోగించవచ్చని మనీష్ తివారీ పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్, కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని పేర్కొన్నారు. బిల్లును వ్యతిరేకించిన బీఎస్పీ ఎంపీ రితేష్.. ఇది పుట్టుస్వామి తీర్పును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఆర్ఎస్పీ ఎంపీ ప్రేమచంద్రన్, కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్, ఆధార్ నివాస రుజువు మాత్రమేనని పౌరసత్వ గుర్తింపుకు ఆధారం కాదని గుర్తుచేశారు












Click it and Unblock the Notifications