"ఆ విశేషాధికారం వాడండి"- సుప్రీంకోర్టుకు కేంద్రం కీలక వినతి..!
రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టుకు కార్యనిర్వాహక వ్యవస్థ అయిన కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే విశేష అధికారాలు ఉంటాయి. రాజ్యాంగ బద్ధంగా తీసుకోని నిర్ణయాలను నిర్దాక్షిణ్యంగా కొట్టేసే అధికారాన్ని సుప్రీంకోర్టుకు కల్పించారు. అయితే సుప్రీంకోర్టు అసాధారణ పరిస్ధితుల్లో తప్ప ఆ విశేషాధికారాలను వాడడం లేదు. కానీ తాజాగా ఓ కీలక అంశం విషయంలో రాజ్యాంగం సుప్రీంకోర్టుకు (supreme court) ఆర్టికల్ 142 ప్రకారం కల్పించిన అధికారాన్ని వాడాలని కేంద్రం (central govt) సూచన చేసింది. దీంతో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఏడాది నీట్ పరీక్ష సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ అధ్వర్యంలో విద్యార్ధులు ఢిల్లీ సహా పలు రాష్టాల్లో రోడ్డెక్కారు. వీరిని అణగదొక్కేందుకు పోలీసులు కూడా బలప్రయోగానికి దిగారు. దీంతో విద్యార్ధులు కూడా పోలీసుల్ని తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ నిరసనలు కొనసాగుతున్న సమయంలోనే వారిపై ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు కేసులు నమోదు చేశాయి. అందుబాటులో ఉన్న ఆధారాలతో ఈ కేసులు నమోదు చేశారు. అయితే కాక్రోచ్ పార్టీ ప్రతినిధులతో చర్చల సందర్భంగా ఈ కేసులన్నీ ఎత్తేస్తామని కేంద్రం వారికి హామీ ఇచ్చింది. అయినా ఇప్పటికీ ఆ కేసులు ఇంకా పలు చోట్ల పెండింగ్ లోనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీ, ఇతర రాష్ట్రాలలో నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా జరిగిన హింసాకాండ ఆరోపణలపై నిరసనకారులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక దరఖాస్తును దాఖలు చేసింది. భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం న్యాయం పూర్తి చేయడానికి నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించాలని కేంద్రం కోరుతున్నట్లు తెలిపారు.
దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును రేపు విచారించాలని నిర్ణయించారు.














Click it and Unblock the Notifications