వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు మళ్లీ ఉద్యమకారుడిగా మారతానని ప్రకటించారు. రైతులు పండించిన వరిని కేంద్రం సేకరించాల్సిందేనని ఆందోళనకు పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్ద ఎత్తున రాష్ట్రమంతా ధర్నాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించారు.

అటువైపు బీజేపీ కత్తి దూసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది. ఒక రోజు ముందే ఆందోళన చేపట్టింది. వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నాకు దిగింది.

కేసీఆర్ ప్రభుత్వం దిగొచ్చేదాకా రైతుల పక్షాన నిలబడి ఉద్యమిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనేందుకు సిద్ధమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదని ఆయన ప్రశ్నించారు.

ధాన్యం సేకరణ రాష్ట్రం చేపడుతుంది. తన అవసరాలు పోనూ మిగతాది కేంద్రానికి అందిస్తుంది. మొత్తానికి కేంద్రం సబ్సిడీ అందిస్తుంది. ఈసారి కేంద్రం బియ్యం కొనుగోలు చేయడం సాధ్యంకాదని చెప్పడంతో రగడ మొదలయింది.

వరి

వరి సేకరణ మీద రెండు పార్టీలు కయ్యానికి సిద్ధం కావడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ పరిస్థితికి కారణం తెలంగాణ విజయగాథ అంటే వింతగా ఉంటుంది.

వరి సాగులో తెలంగాణ ఇప్పుడు దేశంలోనే మేటి రాష్ట్రం అయింది. 2014 -2020 మధ్య రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పూర్తయి నీటి పారుదల విస్తరించింది. ఉచిత విద్యుత్ సరఫరా మెరుగుపడింది. దీనికితోడు వరిపంటకు కనీస మద్దతు ధర ఉంది.

దీంతో రైతులు వరిపంట వైపు వచ్చారు. ఫలితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అలనాటి నినాదం 'కోటి ఎకరాల మాగాణి' దాదాపు నిజమయ్యే క్రమంలో ఉంది.

వరిపంటలో తెలంగాణ నెంబర్ వన్ అయిందని, దేశానికంతా 'అన్నపాత్ర'గా ఎదిగిందని భారత ఆహార సంస్థ ఛైర్మన్ డీవీ ప్రసాద్ గత ఏడాది మే నెలలో అభినందించారు.

2020 రబీ సీజన్‌లో ఈ సంస్థ సేకరించిన మొత్తం 83.01 లక్షల టన్నుల వరి ధాన్యంలో 63 శాతం అంటే 52.23 లక్షల టన్నుల వరి ఒక్క తెలంగాణ నుంచే వచ్చిందని, మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి 37 శాతం అందించాయని ఆయన అన్నారు.

అప్పుడు పండగ చేసుకున్న తెలంగాణ రాష్ట్రం.. 'ఇక వరి చాలు,' అని సరిగ్గా ఏడాది కాలంలోపే అనడం విడ్డూరంగా అనిపిస్తోంది. రబీ(యాసంగి)లో వరి వేయకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాలని చెబుతూ ఉంది. రైతులకు వరి విత్తనం అమ్మకుండా చర్యలు తీసుకుంటూ ఉంది.

ఎవరైనా వరి పండించినా, వరి విత్తనాలు విక్రయించినా కఠినంగా వ్యవహరిస్తానని సిద్దిపేట కలెక్టర్ బహిరంగంగా హెచ్చరించి వివాదం సృష్టించారు. ఇది అప్రజాస్వామికమని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. మరోవైపు తమ పొలంలో వరి తప్ప మరొకటి పండదు, ఉన్నట్లుండి వరి వద్దంటే ఎలా? అని రైతులు వాపోతుండటం రోజూ టీవీల్లో కనిపిస్తూనే ఉంది.

దేశంలో వరి ధాన్యం నిల్వలు పెరిగిపోయాయి. ఇక బియ్యం కొనలేము అని కేంద్ర మంతి నితిన్ గడ్కరీ తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేశారు.

అయితే, గోడౌన్లు నిండిపోవడమేమిటి? ఉన్న బియ్యాన్ని దేశంలో దారిద్ర్యంలో ఉన్న 20 కోట్ల మందికి పంచండి, ఖాళీ అవుతాయని ప్రఖ్యాత జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్ ఆ నెలారంభంలో విజయవాడలో సి రాఘవాచారి స్మారకోపన్యాసంలో సూచించారు.

ఈ నేపథ్యంలో వరి కొనుగోళ్లు స్తంభించిపోవడం వెనక ఉన్న రాజకీయ పరిణామాలు చూస్తే తప్ప సమస్య అర్థం కాదు.

వరి

గత ఏడెనిమిదేళ్లలో తెలంగాణలో వరిసాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. గతంతో పోలిస్తే 2020-2021 రబీలో వరిసాగు విస్తీరణం 237.85 శాతం పెరిగిందని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా రబీలో 22,19,326 ఎకరాల్లో వరి సాగు చేస్తారు. గతేడాది ఇది 52,78,636 ఎకరాలకు పెరిగింది.

దీనితో వరి ఉత్పత్తి కూడా విపరీతంగా పెరిగింది. రాష్ట్రం వరి 'సూపర్ స్టార్' అయింది. ఇక్కడే సమస్య ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ విజయగాథ విషాదానికి దారితీసే ప్రమాదం ఉంది, మేల్కోండని హెచ్చరించినా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని కూడా కొందరు అంటున్నారు.

నిజానికి ఇది ఒక్క తెలంగాణ సమస్యే కాదు. వరి పండించే రాష్ట్రాలన్నింటా ఇదే పరిస్థితి. ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో వరి సంక్షోభం మొదలయింది. ఈ రాష్ట్రాల నుంచి కూడా కేంద్రం వడ్లు సేకరించడం మానేసింది. కేంద్రం కొనాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధానికి లేఖ రాశారు.

కాకపోతే, అక్కడ రాజకీయ సమస్యగా మారలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సేకరించకపోవడంతో తక్కువ ధరలకు రైతులు ధాన్యం అమ్ముకుంటున్నట్లు మీడియా రిపోర్టు చేసింది.

పంజాబ్, హరియాణాల్లో కూడా కేంద్రం వరి సేకరణ జరపలేదు. దీనితో రైతులు అందోళనకు దిగారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందువల్ల వరి సేకరణను తెగేదాకా లాగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యం చేయలేదు. ఖరీఫ్ ధాన్యాన్ని సేకరించాలని రైతులంతా రోడ్డెక్కగానే కేంద్రం దిగొచ్చింది. వరి సేకరణకు అదేశాలు జారీ చేసింది. అక్కడ 97శాతం పంటను సేకరించారు.

''వరి పండగ’’ నుంచి దండగ వరకు..

ఈ సమస్య తెలంగాణలో బాగా రాజకీయమవుతోంది. మొత్తంగా ఉన్నట్లుండి 'వరి పండగ' పోయి 'దండగ'గా మారింది. ఇలా ఎందుకవుతోంది? వరి సేకరించేది లేదని కేంద్రం ఎందుకు మొరాయిస్తోంది? రైతులు వరినే మోక్షసాధనగా ఎందుకు చూస్తున్నారు? పంజాబ్, హరియాణాలకు ఉండే వరి హోదా తెలంగాణ వంటి ఇతర వరి రాష్ట్రాలకు ఎందుకు లేదు? దీని వెనక పెద్ద చరిత్ర ఉంది.

మొన్నమొన్నటి వరకు దక్షిణాది రాష్ట్రాలతో పాటు అనేక ఇతర రాష్ట్రాలకు పంజాబ్, హరియాణాల నుంచి బియ్యం వచ్చేవి. నిజానికి ఈ రెండూ వరి రాష్ట్రాలు కాదు. అక్కడి ప్రజలు బియ్యం పెద్దగా తినరు. అయినా, అవి వరి పండించే రాష్ట్రాలుగా మారాయి.

బియ్యం తినే ప్రజలకు గోధుమ ఎక్కువగా తినే ప్రజలున్న రాష్ట్రాలు బియ్యం సరఫరా చేయడానికి కారణం 1960లో వచ్చిన హరిత విప్లవం. దేశంలో ఆహార భద్రత తీసుకొచ్చేందుకు ఆ రోజుల్లో ఈ రెండు రాష్ట్రాలను ఎంచుకుని వరిని ప్రోత్సహించారు. అప్పటికి తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలలో నీటి పారుదల పెద్దగా లేదు. అందువల్ల పంజాబ్, హరియాణా బియ్యమే దిక్కయింది. వరిపంటను ఈ రాష్ట్రాల్లో ప్రోత్సహించేందుకు సబ్సిడీలు కూడా అందించారు. ఇలా దాదాపు మూడు దశాబ్దాలు సాగింది. అక్కడ వరి రైతులు, వ్యాపారులు బాగా శక్తివంతమయిన లాబీ అయిపోయారు.

''1995 తర్వాత ఈ పరిస్థితి మారడం మొదలయింది. "పౌరసరఫరాల వ్యవస్థలో పంపణీ చేసేందుకు పంజాబ్ నుంచి బియ్యం తీసుకురావడాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకించాయి. స్థానిక బియ్యాన్ని వాడాలని కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చాయి. అదే వరి సేకరణ వికేంద్రీకరణకు దారి తీసింది.

రాష్ట్రమే సేకరించి, తన అవసరాలు పోను మిగతాది కేంద్రానికి పంపించాలి. ఇలా వడ్ల సేకరణలో మార్పు వస్తున్నపుడు, పంజాబ్, హరియాణాల బియ్యం అవసరం తగ్గిపోయింది. దీనికి తగ్గట్టుగా 'వరి పంట వేయవద్దు' అని అక్కడి రైతులకు గట్టిగా కేంద్రం చెప్పలేకపోయింది. దీంతో ఎప్పటిలాగే అక్కడ వరి పండించారు, సేకరణ కొనసాగించారు.

ఇందులో విజ్ఞత కన్న రాజకీయమే ఎక్కువగా ఉంది. ఇలా పంజాబ్, హరియాణాల బియ్యంతో భారత ఆహార సంస్థ గోడౌన్లు నిండిపోతూ వచ్చాయి" అని సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ రామాంజనేయులు చెప్పారు.

వరి

దండగ కాదు.. పండగ

2004 తెలుగు రాష్ట్రాల వ్యవసాయాన్ని కొత్త మలుపు తిప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 'వ్యవసాయం దండగ కాదు, పండగ' అనే నినాదం చాలా ప్రముఖంగా వినిపించింది. ఆ ఏడాది అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ప్రకటించారు. అప్పటిదాకా దేశంలో ఉచిత విద్యుత్ ఒక్క పంజాబ్‌లోనే ఉంది. అదే సమయంలో నీటి పారుదల విస్తరించడం మొదలయింది. ఉచిత విద్యుత్‌తో బోరు బావుల కింద వరి సాగు విపరీతంగా పెరిగింది.

ఉచిత విద్యుత్తు వల్ల పంటల వైవిధ్యం పెరగలేదు. వరికి కనీస మద్దతు ధర ఉండటంతో రైతులు వరి వైపు మళ్లారు. ఉచిత విద్యుత్ ఎటో పోతోందనే భయం నాటి ప్రభుత్వంలో చూచాయగా వచ్చింది. మొత్తం భూగర్భ జలాలను వరికోసం ఇలా తోడుకోవడం మంచిదికాదని, వరియేతర పంటలు పండిస్తేనే ఉచిత విద్యుత్ ఇస్తామని నాటి వ్యవసాయం మంత్రి రఘువీరారెడ్డి చేసిన ప్రకటన పెద్ద గొడవకు దారితీసింది. మంత్రి క్షమాపణలు చెప్పేదాకా వెళ్లింది.

అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉచిత విద్యుత్ కొనసాగుతోంది. నీటి పారుదల పెరుగుతూ ఉంది. విద్యుత్ ఉచితం కావడంతో వరి విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. అయితే, వరి పంట నుంచి రైతులను ఇతర పంటల వైపు మళ్లించాలనే ప్రయత్నం సీరియస్‌గా జరగలేదు. 'వ్యవసాయం పండగ' ధోరణి ప్రత్యేక తెలంగాణలో కూడా కొనసాగింది. కోటి ఎకరాల మాగాణి అని ఇక్కడి ప్రభుత్వం వరిని పోత్సహించింది. దీంతో తెలంగాణ వరిసాగు సూపర్ స్టార్ అయింది.

అయితే, ఈ కమ్రంలోనే ఒక సమస్య కూడా తయారయిందని డాక్టర్ రామాంజనేయులు చెప్పారు. "వరి పొలాలు ఇతర పంటలకు పనికి రాకుండా పోయాయి. ఇది నీళ్లు నిలువ ఉండేలా భూమిని మార్చేస్తుంది. రైతులు నేలను బాగా పొడి చేసి భూమిలోకి నీరు ఇంకిపోకుండా చేస్తారు. ఇలాంటి భూములు ఇతర పంటలకు పనికిరావు. ఈ భూముల్లో ఇతర పంటలు పండించాలంటే కొంతకాలం పడుతుంది. అంతవరకు ప్రభుత్వం రైతులను సాయం చేయాలి. ఇలాంటి ప్రణాళిక ఏమీ లేకుండా ప్రభుత్వం ఉన్నట్లుండి ప్రత్యామ్నాయ పంటలు పండించండి అంటోంది. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే, వరి పంట మీద లభించేంత రాయితీ ఏ పంటకు రాదు. పంజాబ్‌లో ఎకరాకు అత్యధికంగా రు. 29 వేల సబ్సిడీ అందిస్తుంటే తెలంగాణలో దాదాపు రు.24 వేల సబ్సిడీ అందిస్తున్నారు. ఇలాంటపుడు రైతులు వరి పంట మానేయడం కష్టం. నిజానికి కొత్తగా పర్యావరణ కోణం నుంచి కూడా వరి విస్తీర్ణం తగ్గించాలని చెబుతున్నారు. అయినా, ఇక్కడ రాజకీయ వాతావరణం వరికి మాత్రమే అనుకూలంగా ఉండటంతో ఈ సమస్య జటిలమయింది"అని ఆయన చెప్పారు.

వరి సాగులో రాజకీయాల కారణంగా ప్రభుత్వాలలలో ముందుచూపు లోపించిందని, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేందుకు సీరియస్ ప్రయత్నం జరగలేదని రామాంజనేయులు చెప్పారు.

''మూడు పూటలా వరి అన్నం తిన్నా.. తెలంగాణకు కావలసింది 70 లక్షల టన్నులే. కానీ, నేడు ఉత్పత్తి కోటి టన్నులకు మించింది. దీంతో బియ్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. ఏ విధంగా తీసుకున్నా రైతులు పత్యామ్నాయ పంటల వైపు మళ్లక తప్పదు’’ అని ఆయన అన్నారు.

వరి

భారత్ కూడా చైనాలాగా ఎందుకు చేయదు?

"ప్రజల ఆహారపు అలవాట్లు మారడం, వరి డిమాండ్ పడిపోవడం, పర్యావరణం మీద వరి సాగు ప్రభావం.. తదితర కారణాల రీత్యా రైతులు ఇతర పంటలవైపు మళ్లాలి. దీనికి కొంతకాలం పడుతుంది. అంతవరకు ప్రభుత్వం రైతులకు సాయం అందిస్తూ ఉండాల్సిందే"అని ఆయన అన్నారు.

అయితే, చాలామంది నిపుణులు, ఉద్యమకారులు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణిని విమర్శిస్తున్నారు. ఈ సమస్యకు కారణం, కేంద్ర ప్రభుత్వం వరి సేకరణను లాభనష్టాల వాణిజ్య వ్యవహారంగా చూడటమే నని ప్రముఖ వరి వ్యవసాయ, ఆర్థిక నిపుణుడు (Rice agriculture economist)ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అన్నారు.

"ధాన్యం సేకరణ అనేది ఆహార భద్రతకు సంబంధించిన వ్యవహారం. 'గోడౌన్లలో ధాన్యం మురుగుతూ ఉంది’అందుకే వరిని సేకరించలేం అని అనడం సరికాదు. గోడౌన్లను ఖాళీ చేయించాలి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం భారతదేశంలో ఆహార సమస్య తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ ఆకలి సూచిలో 116 దేశాల జాబితాలో భారత్ 101 స్థానంలో ఉంది. వీళ్లందరికి ఉచితంగానో మరొక రూపంలోనో ఆహార ధాన్యాలను పంచితే గోడౌన్లు ఖాళీ అవుతాయి. కరోనా కాలంలోచైనా దాదాపు 100 మిలియన్ టన్నుల బియ్యంను పంపిణీ చేసి, తాజాగా మళ్లీ సెకరించడం మొదలుపెట్టింది. అలా భారత్ చేయాల్సిందే'’అని ప్రొఫెసర్ జానయ్య అన్నారు.

అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం కోదండ రెడ్డి కూడా ఇలాంటే అభిప్రాయమే వ్యక్తం చేశారు."భారత ఆహార సంస్థ, గిడ్డంగుల కార్పొరేషన్ రెండు కూడా కరవు నివారణ, అకలి నివారణ చట్టం నుంచి పుట్టుకొచ్చాయి. అందువల్ల రైతుల నుంచి ధాన్యం కొనలేమని అనడం చట్ట వ్యతిరేకం. ఉన్న ధాన్యాన్ని ప్రజలకు పంచాలి. రేషన్ కోటాను పెంచాలి. కొత్త వారికి ఇవ్వాలి. అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నపుడు పనికి ఆహార పథకం కింద పెద్దఎత్తున బియ్యం పంచారు. మీరు సముద్రంలో పడేసుకుంటారా లేక ఇథనాల్ ప్రొడక్షన్‌కు వాడతారా లేక పేదల పంచుతారా మీ ఇష్టం. కేంద్రం మాత్రం రైతులనుంచి ధాన్యం సేకరంచితీరాల్సిందే'’అని కోదండ రెడ్డి కరాఖండిగా చెప్పారు.

వరి

ప్రత్యామ్నాయ పంటలను రాష్ట్ర ప్రభుత్వ విధానాలే ధ్వంసం చేశాయా?

ఈ విషయంలో మరికొందరు రాష్ట్ర ప్రభుత్వ తీరును కూడా విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం కూడా ఇంతవరకు వరిని ప్రోత్సహిస్తూ వచ్చిందని, ఇపుడు ఉన్నట్లుండి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని బలవంతపెట్టడం సబబు కాదని వారు చెబుతున్నారు.

"కాళేశ్వరం ప్రాజెక్టు వడ్లు పండించేందుకే కట్టారు. తెలంగాణ వ్యవసాయం వరి వైపు వెళ్తున్నదని రెండేళ్ల కిందటే హెచ్చరించాం. వరి విస్తీర్ణం పెరుగుదల మంచిది కాదని చెబుతూనే వస్తున్నాం. తెలంగాణ వ్యవసాయంపై భవిష్యత్ ప్రణాళికలు ఉన్నట్లు కనిపించడంలేదు. మంచి పంటల కార్యాచరణ కావాలి. రైతులను ఆట వస్తువులుగా చేయొద్దు. వడ్ల కొనుగోలు పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి"అని వ్యవసాయ శాస్త్రవేత్త, అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జలపతిరావు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతులకు అనుకూలంగా లేవని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్ అన్నారు. "ఈ విధానాల వల్ల వరి, పత్తి పంటల కిందనే చాలా భూమి ఉంది. రైతులకు ఇవే ప్రధాన పంటలు అయ్యాయి. ప్రభుత్వం చెప్పే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు చాలా అనుమానాలు ఉన్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రైతులు చెరుకు పంట వేసేందుకు అనుకూలంగా ఉన్నారు. నిజాం షుగర్స్ తెరవాలంటున్నారు. పామాయిల్ దిగుమతుతలతో నువ్వులు, పల్లీ పంటలు సమాధి అయ్యాయి. తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎప్పటి నుంచో వేస్తూ వచ్చారు. ప్రభుత్వ విధానాలే దానిని ధ్వంసం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ పంటలను నియంత్రిస్తూ ఉంది. కేంద్రం కూడా యాసంగి పంటను పూర్తిగా కొనుగోలుచేయాలి. రైతులు ఏ రకం వరి పండించినా కొనసాల్సిందే. ఈ విషయంలో రైతులకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వానిదే పాపం అవుతుంది' అని కోదండ రామ్ అన్నారు.

అయితే, సమస్యకు అసలు కారణం కేంద్రం తెలంగాణ మీద చూపిస్తున్న వివక్షయే కారణమని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పంజాబ్ మాదిరిగా తెలంగాణ వడ్లు కేంద్రం ఎందుకు కొనడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

"కేంద్రం అన్ని రకాలుగా సహకారం అందిస్తుండటంతోనే పంజాబ్‌లో వరిపండుతున్నది. గత ఏడేళ్ళుగా తెలంగాణ రైతులు కేంద్రం సహకారం లేకుండా వరి పండిస్తున్నారు. ఇలాంటి పంటకు చేయూత ఇవ్వరా? తెలంగాణలో యాసంగి వడ్లన్నీ బాయిల్డ్ రైస్ కోసమే వేస్తారు. ఇపుడు బాయిల్డ్ రైస్ కొనలేమని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పడం విడ్డూరం. తెలంగాణ రైతుల యాసంగి వడ్లు కొంటారా ? కొనరా? రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలలి. లేకుంటే భవిష్యత్ పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి’' అని ఆయన బుధవారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Centre or state, who is responsible for rice cultivation crisis in Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X