రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!
దేశంలోని కోట్లాది మంది రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 'రుణమాఫీ' అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి నీళ్లు చల్లింది. రైతు రుణాలను మాఫీ చేసే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో కుండబద్దలు కొట్టారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల దృష్ట్యా రుణమాఫీపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశించిన అన్నదాతలకు ఈ ప్రకటన పెద్ద పిడుగుపాటులా తగిలింది.
లోక్‌సభలో ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిచ్చిన మంత్రి, రుణమాఫీ కంటే రైతుల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసే ఇతర చర్యలకే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని వివరించారు. కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా రూ. 3 లక్షల వరకు రాయితీ వడ్డీ రేట్లపై రుణాలు అందిస్తున్నామని, సకాలంలో చెల్లించే వారికి అదనపు ప్రోత్సాహకాలు (MISS పథకం) ఇస్తున్నామని పేర్కొన్నారు. అంటే.. అప్పులు తీర్చడం కంటే, అప్పులు తీసుకోవడానికి మార్గాలను సులభతరం చేయడమే ప్రభుత్వ వ్యూహమని స్పష్టమైంది.

పూచీకత్తు లేని రుణాల పరిమితి పెంపు
రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా, పూచీకత్తు లేకుండా ఇచ్చే స్వల్పకాలిక వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.60 లక్షల నుండి రూ. 2 లక్షలకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు బ్యాంకింగ్ వ్యవస్థ నుండి నిరంతరాయంగా నిధులు అందేలా చూస్తున్నామని, ప్రాధాన్య రంగాలకు తగినంత రుణ ప్రవాహం ఉందని ఆమె సమర్థించుకున్నారు.
నగదు బదిలీయే ప్రధాన అస్త్రం
రుణమాఫీకి ప్రత్యామ్నాయంగా పీఎం-కిసాన్ పథకం ద్వారా నేరుగా నగదు బదిలీ (DBT) చేస్తున్నామని, పంటల బీమా ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. అయితే, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ఈ అరకొర సాయం సరిపోదని, రుణమాఫీ ఒక్కటే తమకు ఊరటనిస్తుందని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి.












Click it and Unblock the Notifications
