ఏం సాధించారు? తమిళ ప్రచారంలో డీఎంకేకు చంద్రబాబు ప్రశ్న..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రచారం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కోయంబత్తూరులో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు.. అనంతరం కృష్ణగిరి జిల్లా తళి నియోజకవర్గంలో ఎన్డీయే అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తళి నుంచి తిరుపతికి బస్సు వేయాలంటూ స్థానిక ఎన్డీఏ నేతలు చేసిన డిమాండ్ కు చంద్రబాబు అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్న ఆదరణ, అభిమానం తమిళనాడులోనూ చూపిస్తున్నారని ఆయన తెలిపారు.
తమిళనాడుకు వచ్చినా తనకు సొంత గడ్డపై ఉన్నట్టే ఉందన్నారు. ఏపీలోని తిరుపతికి తమిళ భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారని, మన భాష ఏదైనా అంతా ద్రవిడులమే అన్నారు. ఎన్టీఆర్ సినీ జీవితం కూడా తమిళనాడు నుంచే ప్రారంభమైందన్నారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు ప్రధాని మోడీ బిల్లు తెస్తే కాంగ్రెస్, డీఎంకే దాన్ని వ్యతిరేకించాయన్నారు. ఢిల్లీని ఓడించామని డీఎంకే విర్రవీగుతోందని, మహిళా బిల్లును అడ్డుకున్న డీఎంకే పార్టీ ఏ సాధించిందని చంద్రబాబు ప్రశ్నించారు. పెరిగిన సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్, డీఎంకేలకు వచ్చిన ఇబ్బందేమిటన్నారు.

గతంలోనూ కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సహకరించలేదని, క్రెడిట్ అవసరం లేదని, ప్రతిపక్షాలకే క్రెడిట్ ఇస్తున్నామని ప్రధాని నేరుగా చెప్పినా కాంగ్రెస్, డీఎంకేలు బిల్లును ఓడించాయన్నారు. నియోజకవర్గాలు 50 శాతం పెరుగుతాయని స్పష్టంగా పేర్కొన్నా ఎందుకు వ్యతిరేకించారో డీఎంకే సమాధానం చెప్పాలన్నారు. తమిళనాడుకు తిరిగి పూర్వ వైభవం రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ గెలవాలన్నారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదని, ఈ ప్రాంతానికి అన్యాయం జరగనివ్వనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అభివృద్ధి, ఉద్యోగాలు కావాలంటే కేంద్ర సహకారం అవసరమని, జయలలిత స్పూర్తితో అభివృద్ధి జరగాలని తెలిపారు. ఎన్డీఏకు వేసే ఓటుతో తమిళనాడు రాష్ట్రం గెలుస్తుందని, ప్రతీ ఇల్లూ, ప్రతీ వ్యక్తీ గెలుస్తారని చంద్రబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications