ఇస్రో.. ఇక బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రం
బెంగళూరు: భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి ఇప్పుడే శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.
చంద్రయాన్ 3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దీనికోసం స్వయంగా ఆయన బెంగళూరుకు వచ్చారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనను ముగించుకుని నేరుగా బెంగళూరులోని ఇస్రో కమాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. రోవర్ దిగిన ప్రదేశానికి శివశక్తిగా నామకరణం చేశారు.

ఈ పరిణామాలన్నింటిపైనా పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు మహువా మొయిత్రా స్పందించారు. మోదీపై సెటైర్లు సంధించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవహార శైలిపై విమర్శలు చేశారు. చంద్రయాన్ 3, ఇస్రోను ఎన్నికలతో ముడిపెట్టారు.
వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ఇస్రో.. ఇక బీజేపీకి ప్రధాన ప్రచార అస్త్రంగా మారినట్టు కనిపించిందని మహువా మొయిత్రా అన్నారు. చంద్రుడిపై ఇస్రో ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ చేయగలిగిన మాట నిజమే అయినప్పటికీ..ఇది మొదటిసారేమీ కాదని అన్నారు. దీన్ని బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మాత్రం దీన్ని మోదీ ఘనతగా చెప్పడం సరికాదని పేర్కొన్నారు.

చంద్రుడిపై ల్యాండర్ మాత్రమే ల్యాండ్ అయిందని, మోదీ కాదని బీజేపీకి గుర్తు చేద్దామని మొయిత్రా పిలుపునిచ్చారు. అలాగే- చంద్రయాన్ 3ని రూపొందించింది, దాన్ని విజయవంతంగా ప్రయోగించిందీ.. బీజేపీ ఐటీ సెల్ కాదని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు జాతీయవాద ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి బీజేపీకి ప్రతి మిషన్ ఉపయోగపడుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

మోదీ భక్తులు, బీజేపీకి చెందిన ట్రోల్ ఆర్మీ.. దశాబ్దాల భారతీయ శాస్త్రీయ పరిశోధనలు సాధించిన విజయాలను మోదీ మ్యాజిక్‌గా ప్రజలను నమ్మించడానికి 24 గంటలూ పని చేస్తోందంటూ చురకలు అంటించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడని రోజుల్లోనే ఇస్రో ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకుందని ఆమె పరోక్షంగా గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications