Chandrayaan 3 landing: మోదీ వర్చువల్ వీక్షణం..?!
బెంగళూరు: ఇంకొన్ని గంటలే. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లి మీద అడుగుపెట్టబోతోంది. నిమిష నిమిషానికి చందమామకు చేరువగా వెళ్తోంది ఈ మాడ్యుల్. బుధవారం సాయంత్రం సరిగ్గా 6:04 నిమిషాలకు ఈ రెండూ చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండ్ కానున్నాయి.
సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు మాడ్యుల్ పనితీరును పర్యవేక్షిస్తోన్నారు. ల్యాండింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లకూ అవకాశం ఇవ్వదలచుకోలేదు. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 విఫలమైన నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు.

ఇప్పటివరకూ చంద్రయాన్ 3 పనితీరులో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తలేదు. దాని పనితీరు సంతృప్తికరంగా ఉంటోంది. చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువైంది. ఈ మధ్యాహ్నానికి చంద్రుడి కక్ష్యలో 70 కిలోమీటర్ల ఎత్తున ఈ మాడ్యుల్ పరిభ్రమిస్తోంది. చందమామ ఆర్బిట్‌లో ఉన్న చంద్రయాన్ 2 ఆర్బిటర్‌తోనూ అనుసంధానమైంది.
సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దేశం మొత్తం ఉత్కంఠతగా ఎదురు చూస్తోంది. గతంలో ఎదురైన చేదు సంఘటనలు పునరావృతం కాకూడదని యావత్ దేశం కోరుకుంటోంది. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ కావాలని కోరుతూ పలువురు ఇవ్వాళ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మసీదుల్లో ప్రార్థనలు జరిపారు.
బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం చంద్రయాన్ 3 ల్యాండింగ్ పట్ల ఉత్కంఠతగా ఎదురు చూస్తోన్నారు. వర్చువల్ విధానంలో ఆయన ల్యాండింగ్ ప్రక్రియను వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.












Click it and Unblock the Notifications