తగ్గనున్న ఇళ్ల ధరలు-పెరగనున్న నిర్మాణాలు-రీజన్ ఇదే..!
దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ప్రకటించిన జీఎస్టీ ధరల తగ్గింపు ద్వారా మిగతా రంగాల తరహాలోనే గృహ నిర్మాణరంగానికి కూడా ఎంతో మేలు జరగబోతోంది. ముఖ్యంగా సిమెంట్ తో పాటు ఇతర నిర్మాణ సామాగ్రిపై తగ్గబోతున్న జీఎస్టీ ధరలు ఇళ్ల ధరల్ని కూడా నేలకు దించబోతున్నాయి. అలాగే గృహనిర్మాణ రంగానికి భారీ ఊపునే తీసుకురాబోతున్నట్లు అంచనా.
నిన్న జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు స్తిరాస్తి రంగానికి వరంగా మారనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న మధ్యతరగతికి భారీ ఊరటనిచ్చేలా గృహనిర్మాణ సామాగ్రిపై జీఎస్టీ ధరల్ని కేంద్రం తగ్గించింది. సిమెంట్ పై ప్రస్తుతం ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి, గ్రానైట్ పలకలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం గృహనిర్మాణ రంగానికి కీలకంగా మారనుంది.

ఈ రెండు నిర్ణయాల వల్ల హౌసింగ్ ప్రాజెక్టుల డెవలపర్లకు ఇన్ పుట్ కాస్ట్ తగ్గడంతో పాటు ప్రాజెక్టుల వయబులిటీ కూడా పెరకబోతోందని ఆశిస్తున్నారు. అలాగే ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యే అవకాశాలు కూడా మెరుగుపడబోతున్నాయి. వీరితో పాటు కొనుగోలుదారులకు కూడా తక్కువ సమయంలో, తక్కువ ధరలోనే ఇళ్లు కొనుక్కునేందుకు అవకాశం దొరకబోతోంది. అసలే పండుగ సీజన్ ప్రారంభం కాబోతున్న తరుణంలో వచ్చిన ఈ ప్రకటన తమకెంతో మేలు చేస్తుందని రియల్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రష్యా చమురు కొనుగోలు చేస్తున్నామన్న కారణంతో భారత్ పై అమెరికా సుంకాల మోత మోగిస్తున్న నేపథ్యంలో ఎదురవుతున్న ఆర్ధిక ఇబ్బందుల్ని కవర్ చేసేందుకు కేంద్రం దేశంలో వస్తు వినిమయాన్ని పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జీఎస్టీ కౌన్సిల్ ఇలా భారీ ఎత్తున జీఎస్టీ స్లాబ్ ధరల్ని తగ్గించింది. ఈ ప్రభావం గృహనిర్మాణ రంగంతో పాటు ఎన్నో రంగాలపై పడనుంది. అంతిమంగా స్వదేశంలో ఆర్ధిక వ్యవస్థను పరుగులు తీయించబోతోందని అంచనా.












Click it and Unblock the Notifications