137 ఏళ్లలో తొలిసారి హిందూ పత్రిక నిలిపివేత: చెన్నైలో పడవలే (పిక్చర్స్)
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు ఆహారం దొరకడం లేదు. తాగునీరు, పాలు ఏమీ దొరకడం లేదు. నగరంలో చాలా ప్రాంతాలు జలదిగ్భందంలో మునిగిపోయాయి.
ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయం చేసేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు ఆహార పొట్లాలు, మంచినీరు అందిస్తున్నాయి. అయితే, అందరికీ అవి అందక పోవడం వల్ల ఇబ్బందులు ఎదురువుతున్నాయి.
అన్ని మౌలికసదుపాయాలు, అత్యవసర సేవలు కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. గత వందేళ్లలో ఇదే అత్యంత దారుణ పరిస్థితి అని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, వర్షాలు, భారీగా నిలిచిపోయిన నీరు కారణంగా అక్కడి ప్రముఖ దినపత్రిక 'ది హిందూ' కూడా బుధవారం ప్రింట్ ఎడిషన్ ప్రచురణ నిలిపేసింది. 1878లో హిందూ స్థాపించగా 137 ఏళ్లలో ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పత్రిక ప్రింటింగ్‌ను నిలిపేయడం ఇదే మొదటిసారి.
చెన్నైలో మౌంట్ రోడ్డులోని హిందూ ప్రధానకార్యాలయంలో జరగాల్సిన సిటీ ఎడిషన్ ముద్రణ నిలిపేసింది. ఈ విషయాన్ని హిందూ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
తమిళనాడులోని చెన్నై, వెల్లూరు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ప్రాంతాలకు పంపించే ఎడిషన్ ప్రింటింగ్ నిలిపేసినట్లు హిందూ వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో పత్రిక పంపిణీ చేయడం సాధ్యపడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే పత్రిక పీడీఎఫ్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినట్లు తెలిపింది.
చెన్నై అతలాకుతలం
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా తమిళనాడులో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సౌకర్యం నిలిచిపోయి, ఇళ్లల్లోకి నీరు చేరిపోవడంతో చెన్నై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి చేయూతనిస్తూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ వెబ్ సైట్ ద్వారా సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.

చెన్నై అతలాకుతలం
నటుడు సిద్ధార్థ్ వరద బాధితులకు ఆహారం ప్యాకెట్లను అందించేందుకు ముందుకు వచ్చారు. సహాయం చేయాలనుకునేవారు తనను సంప్రదించాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎవరైనా ప్యాకెట్లు ఇవ్వదలచుకుంటే తనకు తెలియజేయాలని, తమ బృందం వాటిని పంపిణీ చేస్తుందని తెలిపారు.

చెన్నై అతలాకుతలం
సినీ ప్రముఖులు ఎస్ఎస్ రాజమౌళి, ఖుష్బు, విశాల్, ఐశ్వర్య ధనుష్, సాయిధరమ్ తేజ్, లక్ష్మి మీనన్ తదితరులు చెన్నై ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ సోషల్ వెబ్ సైట్ల ద్వారా ఆకాంక్షించారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో సహాయ చర్యల నిమిత్తం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను సైతం పోస్ట్ చేశారు. తమిళ నటి లక్ష్మి మీనన్ ఫేస్‌బుక్ ఖాతాలో నీట మునిగిన ప్రాంతాల చిత్రాలను కూడా పోస్ట్ చేశారు.

చెన్నై అతలాకుతలం
చెన్నై నగరంలో ఎటు చూసినా నడుంలోతు, పీకల్లోతు దాకా నీళ్లు ప్రవహిస్తున్నాయి. దాంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సహాయక చర్యలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.

చెన్నై అతలాకుతలం
రిజర్వాయర్లు ఓవర్ ఫ్లో అవుతున్నాయి. రెడ్ హిల్స్ ప్రాంతంలోని ఫూండి రిజర్వాయర్ నిండిపోయింది. దీంతో నీటిని విడుదల చేశారు.

చెన్నై అతలాకుతలం
లోతట్టు ప్రాంతాలు మునిగాయి. శివార్లలోని రిజర్వాయర్లతో పాటు అడయాక్ నది కూడా నిండింది. ఆ వరద నీరు చెన్నై నగరంలోకి చేరుకుంది. అన్ని రహదారులు పడవల్లో మాత్రమే తిరిగేలా ఉన్నాయి.

చెన్నై అతలాకుతలం
వేలాది మంది సహాయక పనుల్లో ఉన్నారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అడయార్ నది పొంగడంతో చాలా ఇళ్లు నీట మునిగాయి.

చెన్నై అతలాకుతలం
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూతబడ్డాయి. విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోట్లలో వెళ్లాలన్నా ఇబ్బందిగా మారుతోంది. నగరం వదిలి వెళ్లేందుకు ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి.












Click it and Unblock the Notifications