కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ మార్పు అక్రమమన్న చైనా- 44 వంతెనల నిర్మాణంపై ఆక్రోశం
లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ గతేడాది కేంద్రం తీసుకున్న నిర్ణయంపై చైనా మండిపడింది. ఈ అక్రమ నిర్ణయాన్ని తాము గుర్తించడం లేదని చైనా విదేశాంగశాఖ తాజాగా ప్రకటించింది. రక్షణమంత్రి రాజ్‌నాధ్ సింగ్ సరిహద్దుల్లో నిర్మించిన 44 కీలక వంతెనలను
ప్రారంభించడంపై డ్రాగన్ చేశం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సరిహద్దుల్లో ఉద్రిక్తలను రెచ్చగొట్టేలా ఇరువర్గాలు ప్రయత్నించరాదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావ్ లిజియాన్ పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుదేశాల మధ్య ఏడో దఫా మిలిటరీ స్ధాయి చర్చలు జరిగిన తర్వాతి రోజే చైనా నుంచి ఈ ప్రకటన రావడం చర్చనీయాంశమైంది. జూన్‌లో జరిగిన గల్వాన్ ఘటనలో 20 మంది భారతీయ సైనికులను చైనా పొట్టన పెట్టుకున్న తర్వాత ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన మరింత పెరిగింది. ఆ తర్వాత పలుమార్లు భారత్ విషయంలో చైనా స్పందించినా ఇప్పుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి.

అక్రమంగా కేంద్రపాలితంగా ప్రకటించిన లడఖ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్‌నూ తాము గుర్తించడం లేదని తాజాగా చైనా విదేశాంగప్రతినిధి వ్యాఖ్యానించారు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో మిలటరీ నిఘా కోసం భారత్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం అభ్యంతరకరమని తెలిపారు. భారత్‌తో తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఇరుపక్షాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపారు. ఇప్పటికే సరిహద్దుల్లో ఉద్రిక్తలకు భారతే కారణమన్నారు. సుదీర్ఘ కాలంగా భారత్ వివాదాస్పద ప్రాంతాల్లో బలగాల మోహరింపుతో పాటు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణమన్నారు.