సీతారాం ఏచూరికి చైనా లాల్ సలామ్
Sitaram Yechury: ఇటీవలే కన్నుమూసిన సీపీఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు సీతారాం ఏచూరి పార్థివ దేహానికి పలువురు రాజకీయ నాయకులు, వామపక్ష సిద్ధాంతవాదులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, జననాట్య మండలి కళాకారులు కన్నీటి నివాళి అర్పిస్తోన్నారు. లాల్ సలామ్ అంటూ నినదిస్తోన్నారు.
ఈ ఉదయం దేశ రాజధానిలోని వసంత్ కుంజ్‌లో గల నివాసం నుంచి ఏచూరి పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంలో భాయ్ వీర్ సింగ్ మార్గ్‌లో గల సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్‌కు తీసుకుని వచ్చారు. పార్టీ నాయకులు, సీపీఎం అభిమానుల సందర్శన కోసం ఉంచారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయి రెడ్డి.. నివాళి అర్పించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, రమేష్ చెన్నితల, డీఎంకే నాయకులు ఉదయనిధి స్టాలిన్, టీఆర్ బాలు, దయానిధి మారన్, చరిత్రకారణి రొమిల్లా థాపర్.. ఇలా పలువురు ప్రముఖులు సీతారాం ఏచూరి పార్థిక దేహానికి నివాళి అర్పించారు.
భారత్‌లోని చైనా రాయబారి గ్ఝు ఫెయ్‌హాంగ్ సైతం ఏచూరికి నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఏకే గోపాలన్ భవన్‌కు వచ్చారు. ఏచూరి పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిని ఓదార్చారు.

అనంతరం పాలస్తీనా, వియత్నాం దేశాల రాయబారి అద్నన్ అబు- అల్ హైజా, ఎన్‌గుయెన్ థన్హ్- హై కూడా సీతారాం ఏచూరి నివాళి అర్పించారు. దాదాపుగా ప్రపంచంలో గల అన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు సీతారాం ఏచూరి. అందుకే వారంతా కూడా ఆయనకు నివాళి అర్పించారు. చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ గ్ఝిన్‌హువా కూడా సీతారాం ఏచూరి కన్నుమూత పట్ల ప్రత్యేకంగా ఓ ఆర్టికల్‌ను ప్రచురించింది.
తీవ్ర అనారోగ్య సమస్యలతో సీతారాం ఏచూరి కిందటి నెల 19వ తేదీన ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. న్యుమోనియా తరహా ఇన్‌ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తుల సంబంధిత ఇబ్బందుల బారిన పడ్డారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కొద్దిరోజులు వెంటిలేటర్‌పైనా ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 12వ తేదీన తుదిశ్వాస విడిచారు.












Click it and Unblock the Notifications