వెల్లోకి చిరు, పురంధేశ్వరి: సభ వాయిదా, బిజెపి పట్టు
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు మంగళవారం ఉదయం ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. కేంద్రమంత్రులు చిరంజీవి, దగ్గుబాటి పురంధేశ్వరి, కిల్లి కృపారాణి, పళ్లం రాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు వెల్లోకి వచ్చి తమ నిరసన తెలిపారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభాపతి మీరా కుమార్ గంటపాటు లోకసభను వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఎంపీలు ఆందోళన చేయడంతో వాయిదా పడింది.

బిజెపి మద్దతు: కిషన్ రెడ్డి
బిల్లు ఏ రూపంలో వచ్చినా తమ పార్టీ తప్పకుండా మద్దతిస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. 56 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం ఉందని, దానికి ఈ రోజు ఫలితం రాబోతుందన్నారు. ఎవరికి నష్టం లేకుండా బిజెపి రానున్న రోజుల్లో న్యాయం చేస్తుందని చెప్పారు.
బిజెపి డిమాండ్స్
బిల్లును ఆమోదించుకునే ఉద్దేశ్యంలో భాగంగా జివోఎం సభ్యులు జైరామ్ రమేష్ బిజెపి అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదిస్తే అంగీకరించేది లేదని, పోలవరం ముంపుకు గుర్యయే ఏడు మండలాలను సీమాంధ్రలో కలపాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, పోలవరంకు సంబంధించి అన్ని అనుమతులు వెంటనే ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది. అలాగే బిల్లు పైన పూర్తిస్థాయిలో చర్చ జరగాలన్నారు. కొత్త రాజధానికి నిధులు సభాముఖంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కాగా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో జివోఎం సభ్యులు సాయంత్రం నాలుగు గంటలకు భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాతే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కీలక ప్రకటన చేసే అవకాశముంది. మరోవైపు బిల్లుపై చర్చ నేపథ్యంలో పార్లమెంటు గేటు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications