ఎయిర్ ఇండియా క్రాష్ పై తాజా అప్డేట్- పార్లమెంట్ లో రామ్మోహన్ కీలక ప్రకటన..!
గత నెలలో గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న ఐదు నిమిషాల్లోనే కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంపై ఇవాళ పార్లమెంట్ లో విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించాయి. ఈ ఘటనపై భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ఇచ్చిన నివేదికకూ, మీడియా కథనాలకూ మధ్య గ్యాప్ ఉండటం, కేంద్రం తీసుకున్న చర్యలపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు.
ఇవాళ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగానే ఉభయసభల్లోనూ విపక్షాలు నిరసనలకు దిగాయి. ఆపరేషన్ సింధూర్ తో పాటు పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ నిరనసల మధ్యే రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు ఎయిర్ ఇండియా ప్రమాదంపై కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదం తర్వాత విమానం బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేయడంలో విమాన ప్రమాదాల బ్యూరో సక్సెస్ అయిందని రామ్మోహన్ తెలిపారు.

అలాగే ఈ దర్యాప్తులో పూర్తిగా నిష్పాక్షికంగా, ఖచ్చితమైన, నియమాలను అనుసరిస్తున్నట్లు వెల్లడించారు. తాము కేవలం సత్యానికి అండగా నిలవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కచ్చితంగా ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నామన్నారు. అది ఏఏఐబీ తుది దర్యాప్తు నివేదిక తర్వాత మాత్రమే బయటకు వస్తుందన్నారు.
అంతర్జాతీయ ప్రోటోకాల్స్ ప్రకారం దర్యాప్తు జరుగుతోందన్నారు.

ప్రాథమిక నివేదికను పరిశీలిస్తే గతంలో బ్లాక్ బాక్స్ కొద్దిగా దెబ్బతిన్నప్పుడల్లా దానిని విదేశాలకు పంపేవారని, అయితే తొలిసారి మన దేశంలోనే దీని అధ్యయనం చేస్తున్నట్లు రామ్మోహన్ తెలిపారు. అయితే ఓ కచ్చితమైన ముగింపుకు రావడానికి తుది నివేదిక కోసం ఎదురుచూడాల్సిందేనన్నారు. ఏఏఐబీ క్షుణ్ణంగా, నిబంధనల ఆధారంగా పూర్తిగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందన్నారు. ఇందులో అనేక ప్రశ్నలు తలెత్తవచ్చని, పాశ్చాత్య మీడియా వారి స్వంత కథనాలను ముందుకు తెచ్చినప్పటికీ తమ విధానం వాస్తవాలపై ఆధారపడి ఉంటుందన్నారు.
270 మంది మరణాలకు కారణమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో చేస్తున్న దర్యాప్తులో ప్రాథమిక నివేదిక ఇప్పటికే వెల్లడైంది. ఇందులో కాక్ పిట్ లో ఓ పైలట్ మరో పైలట్ తో ఫ్యూయల్ స్విచ్ ఎందుకు ఆపావని అడిగితే మరో పైలట్ తాను ఆపలేదని చెప్పినట్లు, తిరిగి స్విచ్ ఆన్ చేసే లోపే విమానం కుప్పకూలినట్లు తెలిపారు. దీనిపై తీవ్ర కలకలం రేగింది. పైలట్లదే తప్పు అన్నట్లుగా ఈ రిపోర్టు ఉందని పైలట్ల సంఘం మండిపడింది. ఆ తర్వాత విదేశీ మీడియాలోనూ కెప్టెనే ఈ స్విచ్ ఆఫ్ చేసినట్లు పరోక్షంగా తేలిందని కథనాలు వచ్చాయి. దీనిపై పైలట్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు కూడా పంపింది.












Click it and Unblock the Notifications