సుప్రీం ఛీఫ్ జస్టిస్ కీలక నిర్ణయం- రోజూ బెయిల్, బదిలీ వాజ్యాలపై అన్ని బెంచ్ ల విచారణ..
సుప్రీంకోర్టులో పేరుకుపోతున్న బెయిల్, బదిలీ పిటిషన్ల కారణంగా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న వారు, బదిలీ వాజ్యాలు దాఖలు చేస్తున్న వారు నెలల తరబడి విచారణ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
సుప్రీంకోర్టులో ప్రస్తుతం 13 బెంచ్ లు ఉన్నాయి. అయినా ఎంపిక చేసిన బెంచ్ లలో మాత్రమే బెయిల్, బదిలీ వాజ్యాల విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై అన్ని బెంచ్ లలోనూ బెయిల్, బదిలీ వాజ్యాల్ని విచారించాలని ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశాలు ఇచ్చారు. అలాగే ప్రతీ రోజూ తమ రెగ్యులర్ వాజ్యాల కంటే ముందు వీటిని విచారించాలని సీజేఐ ఆదేశించారు. ఇలా డిసెంబర్ 25న క్రిస్మస్ వరకూ ఈ వాజ్యాల విచారణకు ప్రాధాన్యం ఇవ్వాలని సీజేఐ ఆదేశాలు ఇచ్చారు.

అలాగే ప్రతీ రోజూ పది బెయిల్, బదిలీ వాజ్యాలను విచారించాలని కూడా సీజేఐ చంద్రచూడ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ లెక్కన 13 సుప్రీంకోర్టు బెంచ్ ల్లో రోజుకు 10 వాజ్యాల చొప్పున రోజుకు మొత్తం 130 వాజ్యాలు పరిష్కరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల్లో పేర్కొన్నారు. అలా చేస్తే క్రిస్మస్ సెలవుల కంటే ముందు అన్ని పెండింగ్ బెయిల్, బదిలీ వాజ్యాలు క్లియర్ అవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 3 వేల బదిలీ వాజ్యాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ కుటుంబ తగాదాలు, ఇతర వాజ్యాలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషనర్లు కోరుతున్నవి ఉన్నాయి.












Click it and Unblock the Notifications