దుబాయ్ గురుద్వారాలో సీజేఐ - ఎన్నారైల సత్కారం : మూలాలను విడవొద్దు..!!
యూఏఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు దుబాయ్ లోని గురుద్వారా సందర్శించారు. సతీమణి శివమాలతో కలిసి ప్రార్థనలు చేశారు. దుబాయ్ లో ఈ రోజు జరిగే ప్రపంచీకరణ యుగంలో మధ్యవర్తిత్వం అనే సదస్సులో సీజేఐ పాల్గొననున్నారు. అబుదాబీలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన సీజేఐ ఎన్వీ రమణతో పాటుగా సుప్రీం న్యాయమూర్తులను ప్రవాస భారతీయులు ఘనంగా సత్కరించారు. అక్కడ ఇండియన్ సోషల్ కల్చరల్ సెంటర్ నిర్వహించిన అభినందన సభలో ఆయన కీలక సూచనలు చేసారు.
యూఏఈ న్యాయశాఖా మంత్రి..అక్కడి ప్రధాన న్యాయమూర్తి స్థానికంగా ఉండే భారతీయులను అభినందించటం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. మాతృభూమికి మంచిపేరు తెస్తున్న మీరే నిజమైన భారత దౌత్యవేత్తలని ప్రశంసించారు. భారతీయులు ఎక్కడ ఉన్నా.. ఎక్కడకు వెళ్లినా మాతృభూమిని..మాతృభాషను మరవొద్దని సూచించారు. మూలాలను విడవొద్దని ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. న్యాయపరమైన విషయాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడానికి భారత్-యూఏఈలు ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాయి.

యూఏఈ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీలకు న్యాయవాదులను అందుబాటులో ఉంచడం గురించీ చెప్పామని సీజేఐ వివరించారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంవల్ల బాధితులకు ప్రయోజనాలు దక్కడం లేదని చెప్పినప్పుడు ప్రతి ఆరు నెలలకోసారి పరిస్థితులను సమీక్షించి తీర్పులను అమలుచేయడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

అనువాదకులు తగిన సంఖ్యలో లేకపోవడం వల్ల కోర్టుల్లో వస్తున్న ఆచరణాత్మక సమస్యల్ని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ రోజు దుబాయ్ లో జరిగే ప్రపంచీకరణ యుగంలో మధ్యవర్తిత్వం అనే సదస్సులో సీజేఐ కీలక ప్రసంగం చేయనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి చారిత్రాత్మక పర్యటన రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేస్తుందని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ ద్వారా పేర్కొంది.













Click it and Unblock the Notifications