• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cloud Burst-KCR: ‘క్లౌడ్ బరస్ట్‌లు చేస్తా ఉన్నరు.. విదేశాలు కావాలనే కుట్రలు చేస్తున్నాయి’ - కేసీఆర్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

గోదావరి వరదలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఈ వరదల వెనుక విదేశీ కుట్ర ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

విదేశాలు కావాలనే భారతదేశంలో కొన్ని చోట్ల క్లౌడ్ బరస్ట్‌లు చేస్తున్నాయని, గోదావరి పరివాహక ప్రాంతంపైన కూడా ఇలాంటి కుట్రే చేస్తున్నారని తమకు అస్పష్టమైన సమాచారం అందిందని కేసీఆర్ అన్నారు.

భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

''చరిత్రలో కనీవినీ ఎరుగని వరదను కడెం ప్రాజెక్టు వద్ద చూశాం. ఏ ఒక్కరోజూ అది 2.50 లక్షల (క్యూసెక్కులు) దాటలేదు అది. దాని హయ్యెస్ట్ డిశ్చార్జి సుమారు 3 లక్షలు (క్యూసెక్కులు) ఉంటుంది. ఈసారి 5 లక్షలు దాటిపోయింది. మానవ ప్రయత్నం కాదు, భగవంతుని దయతోనే అది బతికింది. ఆ ఫొటోలు, వీడియో చూస్తాఉంటే.. మొత్తం అంతా నీళ్లు ఉండి.. మీద ఒక గీతలాగా డ్యామ్ కనబడుతోంది. గీత గీసినట్టే. అలాంటి పరిస్థితుల్లో మనం ఏదో దక్కించుకోగలిగినాం కానీ.

క్లౌడ్ బరస్ట్ అనేది కొత్త పద్దతేదో వచ్చింది. దీనిమీద ఏవో కొన్ని కుట్రలు ఉన్నాయని చెబుతున్నారు. ఎంత వరకు కరెక్టో కూడా తెలవదు. ఇతరదేశాల వాళ్లు కావాలనే మన దేశంలో అక్కడక్కడా క్లౌడ్ బరస్ట్‌లు చేస్తా ఉన్నరు. గతంలో ఒకసారి కశ్మీర్ దగ్గర లద్ధాఖ్-లేహ్‌లో చేశారు, తర్వాత ఉత్తరాఖండ్‌లో చేశారు. ఈమధ్య గోదావరి పరివాహక ప్రాంతంపైన కూడా చేస్తున్నరని మనకు ఒక గ్లూమీ, గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం. ఏమైనప్పటికీ వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల ఇట్లాంటి ఉత్పాతాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సందర్భాల్లో మనం ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది'' అని కేసీఆర్ అన్నారు.

ఇంతకూ క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి ? దీని గురించి వాతావరణ శాఖ ముందుగానే సమాచారం అందిస్తుందా? క్లౌడ్ బరస్ట్‌కు కారణాలేంటి?

దిల్లీలోని ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (వెదర్ ఫోర్‌కాస్టింగ్ సెంటర్) అధిపతి డాక్టర్ కుల్దీప్‌ వీటన్నిటి గురించి ఇలా వివరించారు.

క్లౌడ్ బరస్ట్

క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?

వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం, ఒక చిన్న ప్రాంతంలో (ఒకటి నుండి పది కిలోమీటర్ల లోపు) ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్ అంటారు.

ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 2013లో ఉత్తరాఖండ్‌లో జరిగినట్లుగా భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అయితే, కుంభవృష్టి కురిసిన ప్రతిసారీ క్లౌడ్ బరస్ట్ అని చెప్పలేం.

క్లౌడ్ బరస్ట్‌కు కారణాలేంటి?

ఇది భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలు దక్షిణాన అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకువస్తాయి. వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కారణంగా మధ్యధరా తీరం నుంచి వీస్తున్న గాలులు పశ్చిమాన ఇరాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి తేమను తోడ్కొని వస్తాయి.

ఈ రెండూ ఢీకొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఇవి అకస్మాత్తుగా తక్కువ సమయంలో భారీగా వర్షిస్తాయి.

పర్వతాలపై తరచూ ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి తక్కువ సమయంలో కుంభవృష్టి కురిపిస్తాయి. ఆ కారణంగా పర్వతాలపై క్లౌడ్ బరస్ట్ సంఘటనలు అధికంగా జరుగుతుంటాయి.

వర్షాకాలంలో మాత్రమే క్లౌడ్ బరస్ట్ జరుగుతుందా?

సాధారణంగా రుతుపవనాలు వచ్చే ముందు, వచ్చిన తరువాత కూడా క్లౌడ్ బరస్ట్ జరుగుతుంటుంది.

నెలల్లో చెపాలంటే మే నుంచి జూలై-ఆగస్ట్ వరకు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి.

క్లౌడ్ బరస్ట్‌ను ముందే అంచనా వేయొచ్చా?

ఒకటి నుంచి పది కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల్లో వాతావరణ మార్పుల కారణంగా తేమతో నిండిన భారీ మేఘాలు మోహరించడం వలన క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది. అందువల్ల వీటిని అంచనా వేయడం కష్టం.

రాడార్ సహాయంతో పెద్ద ప్రాంతంలో కురవబోయే భారీ వర్షాలను వాతావరణ శాఖ అంచనా వేయగలదు. కానీ ఏ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరగవచ్చు అనేది అంచనా వేయడం దాదాపు అసాధ్యం.

పర్వత ప్రాంతాల్లోనే మేఘాల విస్ఫోటనం జరుగుతుందా?

అలాగని చెప్పలేం. దిల్లీ, పంజాబ్, హరియాణా లాంటి సమతల ప్రాంతాల్లో కూడా క్లౌడ్ బరస్ట్ సంభవించవచ్చు.

అయితే, భారతదేశంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఉత్తరాదినే సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఎత్తులో చిన్న చిన్న పర్వతాలు అనేకం ఉంటాయి. అలాంటిచోట క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశాలు అధికం.

ఈశాన్య (నార్త్-ఈస్ట్) ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరుగుతుందా?

చిరపుంజీలాంటి ప్రాంతాల్లో ఏడాది పొడుగునా వర్షాలు కురుస్తుంటాయి. బెంగాల్ తీరం నుంచి అధిక తేమతో కూడిన గాలులు వీస్తుంటాయి. కాబట్టి వర్షాకాలంలో క్లౌడ్ బరస్ట్ సంభవమే.

అక్కడ చాలాసార్లు మేఘాల విస్ఫోటనం జరిగింది. కానీ అక్కడి ప్రజలు ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందు నుంచి సిద్ధంగా ఉంటారు.

నీరు ఒకేచోట పేరుకుపోదు. త్వరగా పల్లానికి తరలిపోతుంది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నివసించరు. అందుచేత అక్కడ క్లౌడ్ బరస్ట్ అయినా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించడం అరుదు.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, కేవలం ఒక్క గంటలో 10 సె.మీ వర్షం కురవడం వలనే నష్టం వాటిల్లదు. సమీపంలో నది లేదా సరస్సు ఉంటే, కుంభవృష్టి వలన వాటిల్లో నీరు పొంగి, వరదలు ముంచెత్తడం వలన చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

ఈ కారణంగానే జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ప్రాంతాల్లో ‌సంభవించిన క్లౌడ్ బరస్ట్ సంఘటనల్లో అధిక ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిన వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Cloud Burst-KCR: 'They are doing cloud bursts.. They are plotting to want foreign countries' - KCR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X