smog tower: దేశంలోనే తొలిసారిగా ఢిల్లీలో స్మాగ్ టవర్ -కాలుష్యంపై పోరులో కేజ్రీవాల్ -ప్రత్యేకతలివే
చలికాలం సమీపిస్తుండటంతో ఢిల్లీ వాసుల గుండెలు అదురుతున్నాయి. ముందున్న మనిషి కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు పేరుకోవడం, దాంతో వాహనాలు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటం, పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతుండం ప్రతి వింటర్ లో పరిపాటిగా మారింది. కొన్నేళ్లుగా దేశ రాజధాని వాతావరణం అతి ఘోరంగా మారుతోన్న దరిమిలా కాలుష్యం కట్టడికి కేజ్రీవాల్ సర్కారు కంకణం కట్టుకుంది. నిజానికి సుప్రీంకోర్టు అక్షింతల తర్వాతే ఆప్ సర్కారులో చలనం వచ్చింది. కాలుష్యంపై పోరులో భాగంగా..
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సోమవారం నాడు ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో స్మాగ్ టవర్‌ను ప్రారంభించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏటికేడు తీవ్రమవుతుండటంతో స్మాగ్ టవర్లను ఏర్పాటు చేయాలని ఆప్ సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు ఇవాళ కన్నాట్ ప్లస్‌లో మొదటి స్మాగ్ టవర్‌ను ప్రారంభించింది. ఈ కేజ్రివాల్ మాట్లాడుతూ..

ఇకపై ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్‌కు అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాలుష్యంపై పోరాటంలో భాగంగా ఇవాళ తాము దేశంలో తొట్టతొలి స్మాగ్ టవర్‌ను ఢిల్లీలో ప్రారంభించామని, ఈ స్మాగ్ చుట్టూ ఒక కిలోమీటర్ పరిధిలో గాలిని శుభ్రం చేస్తుందని కేజ్రివాల్ తెలిపారు. ప్రయోగాత్మకంగా తాము ఈ స్మాగ్ టవర్‌ను ప్రారంభించామని, ఈ స్మాగ్ టవర్ పనితీరుకు సంబంధించిన డేటాను ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే పరిశీలించనున్నాయని ఆయన చెప్పారు. ఆ డాటా ఆధారంగా భవిష్యత్తులో స్మాగ్ టవర్ల ఏర్పాటుపై నిర్ణంయ తీసుకుంటామన్నారు.

ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని నివారించడంలో స్మాగ్ టవర్ ముఖ్య పాత్ర పోషించనున్నది. పైలట్ ప్రాజెక్టుగా గత ఏడాది అక్టోబర్ నెలలో దీనిని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీని పనులు నిలిచిపోయాయి. రెండేండ్ల పాటు దీని పనితీరుపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం మిగతా ప్రాంతాల్లో కూడా స్మాగ్ టవర్లను నెలకొల్పుతారు.
ఈ స్మాగ్ టవర్ 24 మీటర్ల ఎత్తులో ఉండి.. 1 కిలోమీటర్ల వ్యాసార్థంలోని గాలిని శుభ్రపరుస్తుంది. ఈ పొగమంచు టవర్ కలుషితమైన గాలిని లోపలికి తీసుకుని స్వచ్ఛమైన గాలిని 10 మీటర్ల ఎత్తులో విడుదల చేస్తుంది. ఈ టవర్ ప్రతి సెకనుకు 1000 క్యూబిక్ మీటర్ల గాలిని శుభ్రపరుస్తుంది.దీనిని ప్రారంభించిన తర్వాత నిపుణులు ఢిల్లీలో వాయు కాలుష్యంపై దాని ప్రభావాన్ని తెలుసుకుంటారు. ఫలితాల ఆధారంగా, ఢిల్లీలోని ఇతర ప్రదేశాల్లో ఈ పరికరాలను ఇన్‌స్టాల్ చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు.

కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ విహార్ వద్ద స్మాగ్ టవర్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని గత ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో 3 నెలల్లో కన్నాట్ ప్లేస్‌లో టవర్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు కన్నాట్ ప్లేస్ స్మాగ్ టవర్‌ను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications