రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఎలుకలతో పోల్చి.. ఆర్ఎస్ఎస్, బీజేపీపైనా సీఎం హేమంత్ సోరెన్ నిప్పులు
జార్ఖండ్ రాష్ట్రం త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతుంది. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు జార్ఖండ్లో అధికారి కోసం ముమ్మర కసరత్తు మొదలుపెట్టాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలలో 41 స్థానాలను కైవసం చేసుకుంటే అధికారం తమ ఖాతాలో పడుతుందని, ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా కూటమి అధికారంలో ఉంది.
జార్ఖండ్ ఎన్నికల పోరు
జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తున్నారు. మళ్లీ ఎన్నికలలో గెలిచి తీరాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈసారైనా జార్ఖండ్ రాష్ట్రంలో పాగా వేయాలని బిజెపి కూడా తీవ్రంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే జార్ఖండ్ లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు కూడా బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది.

రాష్ట్రాన్ని ఎలుకల్లాగా ఆక్రమించి నాశనం చేస్తున్న ఆర్ఎస్ఎస్ : హేమంత్ సోరెన్
ఇదిలా ఉంటే తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సాహిబ్ గంజ్ లోని భోగ్య దిహ్ లో జరిగిన ర్యాలీలో హేమంత్ సోరన్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ రాష్ట్రాన్ని ఎలుకల్లాగా ఆక్రమించి నాశనం చేస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. బిజెపి హిందూ ముస్లిం వర్గాల మధ్య చిచ్చు పెడుతోందని ఆయన మండిపడ్డారు.
గ్రామాల్లోకి వస్తే తరిమి కొట్టండి
ఎలుకల్లాగా చొరబడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ శక్తులు మీ గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు మతకలహాలు, ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి ఎంతకైనా దిగజారుతుందని హేమంత్ సోరెన్ ఆరోపించారు. దేవాలయాలు మసీదులలో మాంసం విసిరేయడం వంటి రెచ్చగొట్టే సంఘటనలు పెరుగుతాయని అంచనా వేశారు.
బీజేపీ వ్యాపారుల, పారిశ్రామిక వేత్తల పార్టీ
మత విద్వేషాలను రెచ్చగొట్టి తద్వారా లాభం పొందాలన్న ఉద్దేశంతో బిజెపి ఉందని హేమంత్ సోరెన్ ఆరోపించారు. బిజెపి బడుగు బలహీన వర్గాల పార్టీ కాదని, వ్యాపారులు పారిశ్రామికవేత్తల పార్టీగా ఆయన అభివర్ణించారు. బిజెపి రాజకీయ నాయకులను తమ అజెండా కోసం కొనుగోలు చేస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల బీజేపీతో కలిసిన జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దు
జార్ఖండ్లో జనాభా మార్పుల పైన బిజెపి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఇక అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి అస్సాం రాష్ట్రంలో గిరిజనులు అనేక అఘాయిత్యాలను ఎదుర్కొంటుంటే ఆయనకు జార్ఖండ్లో ఏం పని అంటూ ప్రశ్నించారు. జార్ఖండ్ ప్రజలు బిజెపి నాయకులను మాటలు నమ్మొద్దని, ఆర్ఎస్ఎస్ ను దగ్గరికి కూడా రానివ్వొద్దని హేమంత్ సోరెన్ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications