మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం: అలాంటి భవనాల కోసం స్పెషల్ డ్రైవ్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సంభవించిన ఘోర అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 27 మంది సజీవ దహనం అయ్యారు. 12 మందికి తీవ్ర గాయలయ్యాయి. 29 మంది గల్లంతయ్యారు. ఆచూకీ తెలియనివారిలో 24 మంది మహిళలు ఉన్నారు. వారంతా మరణించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మూడంతస్తుల భవన సముదాయంలో కొనసాగుతున్న ఓ ఫ్యాక్టరీలో ఈ పెను ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో ఇప్పటివరకు పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కంపెనీ ఓనర్లు హరీష్ గోయెల్, వరుణ్ గోయెల్‌పై ఐపీసీ 304, 308, 120, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ భవన యజమాని పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కొన్ని గంటలుగా ఇవి కొనసాగుతున్నాయి. ఢిల్లీ పశ్చిమ ప్రాంతం డిప్యూటీ కమిషనర్ కీర్తి గార్గ్ ఈ పనులను పర్యవేక్షిస్తోన్నారు.

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదం సంభవించడానికి గల కారణాలు.. తదనంతర పరిణామాలపై సమగ్ర నివేదికను అందజేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ఇలాంటి భవనాలు ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఇంకా ఎన్ని ఉన్నాయో ఇందులో పొందుపర్చాలని అన్నారు.

అగ్నిమాపక సిబ్బంది నుంచి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండా, ప్రమాదకర స్థితిలో వ్యాపార కార్యకలాపాలను సాగిస్తోన్న భవన సముదాయాలను గుర్తించాలని చెప్పారు. ఈ ఘటన తనను కలచి వేసిందని, ఇకపై ఇలాంటివి చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాంటి భవనాలను గుర్తించడానికి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. బాధ్యులను పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు.

మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గాయపడ్డ వారికి 50 వేల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియో ఇస్తామని అన్నారు. పూర్తిగా కాలిపోవడం వల్ల మృతదేహాలను గుర్తించడం కష్టతరమైందని, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా వాటిని ఆయా కుటుంబాలకు అప్పగిస్తామని చెప్పారు. ప్రమాద సమయంలో 250 నుంచి 300 మంది వరకు ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది వివరించారని అన్నారు.