DMK మేనిఫెస్టో విడుదల.. సీఎం స్టాలిన్ వరాల జల్లు..
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. అధికార డీఎంకే పార్టీ మరోసారి గద్దెనెక్కాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే పార్టీ ఈసారి అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ దళపతి టీవీకే పార్టీ అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఈ పరిణామాల మధ్య తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అయితే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార డీఎంకే పార్టీ ఓటర్లపై మరోసారి వరాల జల్లు కురిపించింది.
డీఎంకే మేనిఫెస్టోలోని వివరాల ప్రకారం.. తమిళనాడులో మళ్లీ డీఎంకే అధికారంలోకి వస్తే మహిళలకు అందుతున్న నెలవారీ గౌరవ వేతనాన్ని రూ. 1000 రూపాయల నుంచి 2 వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అలాగే వృద్ధాప్య పింఛను రూ.2వేలకు పెంపుతోపాటు ఇల్లత్తారసి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి గృహిణికి 8 వేల రూపాయల విలువైన కూపన్లను అందజేస్తామని స్టాలిన్ తెలిపారు.
అలాగే ప్రస్తుతం 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని, ఇకపై 8వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ వర్తింపజేయనున్నట్లు డీఎంకే ప్రభుత్వం పేర్కొంది. ఇక ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ పథకం కింద వార్షిక ఆదాయ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచడమే కాకుండా బీమా మొత్తాన్ని రూ. 10 లక్షల వరకు పెంచారు. అలాగే ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులందరికీ ఉచితంగా విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేస్తామని సీఎం స్టాలిన్ వెల్లడించారు.

ఇక యువతకు ఉచిత ల్యాప్ టాప్ లు అందజేత.. వచ్చే ఐదేళ్లలో 10లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం లాంటి పథకాలు కూడా మేనిఫెస్టోలో ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో ప్రజల అవసరాలను, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు సీఎం స్టాలిన్ వెల్లడించారు. మరోవైపు తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications