విజయ్ కు తొలి ఛాలెంజ్: తమిళనాట బాలిక కిడ్నాప్, హత్య
తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోయంబత్తూరు జిల్లా సూలూరులో గురువారం సాయంత్రం కిడ్నాప్ కు గురైన బాలిక నిర్జీవంగా కనిపించింది. కోయంబత్తూర్ శివారులోని కన్నంపాళ్యం చెరువు వద్ద ఆ బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన కలకలం రేపుతోంది. బాలిక మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబ సభ్యలు నిరాకరిస్తోన్నారు. తమ కుమార్తె మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు.
ఆ బాలిక స్వస్థలం సూలూరు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. ఆమె కోసం బంధువులు, స్థానికులు వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో సులూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్ని చోట్ల గాలించినప్పటికీ ఆమె ఆచూకీ తెలియరాలేదు.

శుక్రవారం కన్నంపాళ్యం చెరువు వద్ద బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శరీరంపై గాయాలు కనిపించాయి. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ఇంటికి సమీపంలో ఉన్న కిరాణా షాప్ నకు వెళ్తోన్న ఆ బాలిక వెనకే ఇద్దరు యువకులు వెళ్లినట్లు తేలింది. ఈ ఫుటేజీ ఆధారంగా వారిని సూలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కార్తీక్, మోహన్ రాజ్ ఆమెను అపహరించి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూలూరు పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయం కోసం ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి విజయ్ నుండి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు తమ కుమార్తె మృతదేహాన్ని తీసుకోబోమని ఆ బాలిక తల్లి స్పష్టం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. అక్కడే బైఠాయించారు.
ఈ ఘటనపై విజయ్ స్పందించారు. కోయంబత్తూరులో పదేళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన తీవ్ర ఆవేదన, దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు. ప్రాణంగా పెంచుకున్న బిడ్డను కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోన్నానని చెప్పారు. ఇలాంటి మానవత్వం లేని, క్షమించరాని నేరాలను సమాజం ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు.
கோயம்புத்தூரில் நேற்று 10 வயது சிறுமிக்கு நிகழ்ந்த கொடூர சம்பவம் மிகுந்த வேதனையையும், அதிர்ச்சியையும் அளிக்கிறது. இத்தகைய மனிதநேயமற்ற மற்றும் மன்னிக்க முடியாத குற்றச் செயல்கள் நமது சமூகத்தில் ஒருபோதும் ஏற்றுக்கொள்ளப்பட முடியாது.
— CMOTamilNadu (@CMOTamilnadu) May 23, 2026
தங்கள் உயிருக்குயிரான குழந்தையைப் பிரிந்து வாடும்…
ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులు అరెస్ట్ అయ్యారని, ఘటనపై వేగంగా, సమగ్రంగా దర్యాప్తునకు ఆదేశించినట్లు వివరించారు. వెంటనే ఛార్జిషీటును సైతం దాఖలు చేయాలని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సూచించానని విజయ్ తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే అరాచక చర్యలకు పాల్పడేవారికి చట్టం ప్రకారం కఠిన శిక్ష పడేలా చేస్తానని, దీనికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications