వణుకుతున్న ఉత్తరాది.. ఆ రాష్ట్రాలకు ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలెర్ట్ జారీ.. స్కూళ్ళకు సెలవులు!!
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ మరియు హిమాచల్ ప్రదేశ్ లకు ఐఎండీ అధికారులు సోమవారం తీవ్రమైన చలి గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రతరం కావడంతో అనేక రాష్ట్రాలు వణికిపోతున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. దానికి తోడు పొగమంచు కూడా అధికం కావడంతో వాతావరణ శాఖ ఢిల్లీతో పాటు ఆయా రాష్ట్రాలలో హెచ్చరికలు జారీ చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానాలలో రెడ్ అలర్ట్, రాజస్థాన్, బీహార్లలో ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది.

ఉత్తరాదిని వణికిస్తున్న చలిగాలులు.. స్కూళ్ళకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వాల నిర్ణయాలు
వాయువ్య భారతదేశంలో కొనసాగుతున్న తీవ్రమైన చలిగాలుల ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని పాఠశాలలు ఇప్పటికే సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుత చలి పరిస్థితుల దృష్ట్యా సెలవులు పొడిగిస్తూ వివిధ రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ మళ్లీ నోటీసు జారీ చేసింది. అన్ని పాఠశాలలు జనవరి 14 వరకు మూసివేయబడతాయి అని పేర్కొంది. 9 నుండి 12 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించబడతాయని వెల్లడించారు. ఇక జనవరి 16 నుండి తరగతులు కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది.

ఢిల్లీలోనూ జనవరి 15 వరకు సెలవులు
ఇదిలా ఉంటే జార్ఖండ్ ప్రభుత్వం జనవరి 14 వరకు రాష్ట్రంలోని KG నుండి 7వ తరగతి వరకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను మూసివేయాలని నిర్ణయించింది. జనవరి 15 ఆదివారం కాగా, ఆపై తరగతులు జనవరి 16 నుంచి పునఃప్రారంభమవుతాయి అని నోటీసులో పేర్కొన్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లకు చలి గాలుల హెచ్చరికలను జారీ చేసిన ఐఎండి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ తీవ్రమైన చలి కాలంలో ప్రభావంతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈనెల 15వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ ఢిల్లీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది .

ఢిల్లీలో పొగమంచు కారణంగా ఆలస్యంగా విమానాల్లు, రైళ్లకు అంతరాయం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత డేంజర్ లెవెల్స్ కు పడిపోయింది. ఇది ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుంది. ఢిల్లీలో నేడు కనిష్ఠ ఉష్ణోగ్రత 1.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గత రెండేళ్లలో దేశ రాజధాని ఢిల్లీలో నమోదైన అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రత ఇదేనని ఐయండి వర్గాలు వెల్లడించాయి. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు పొగమంచు కారణంగా ఉత్తర రైల్వే ప్రాంతంలో రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. 29 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు ఇవే
ఇక ఆదివారం హర్యానాలో హిస్సార్ 1.4 డిగ్రీలు, రాజస్థాన్లోని చురు లో -0.5 డిగ్రీలు, పిలానీలో 1.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.దేశవ్యాప్తంగా ఉత్తర తూర్పు ప్రాంతాలలో తీవ్రమైన పొగమంచు కారణంగా 480 కి పైగా రైళ్ల రాకపోకల పై ప్రభావం కనిపిస్తుంది. రానున్న రెండు రోజుల్లో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ భావిస్తున్నప్పటికీ తాజా పరిస్థితులు మాత్రం ఆందోళన కరంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications