అడ్డుకోలేరు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: దీదీకి షా హెచ్చరిక
కోల్‌కతా: భారతీయ జనతా పార్టీ తలపెట్టిన ‘విజయ్‌పథ్' కార్యక్రమాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ‘పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి వస్తున్నాం.. ఇక్కడ మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం' అని అమిత్ షా స్పష్టం చేశారు.
చిట్‌ఫండ్ కుంభకోణంలో మచ్చపడ్డ తన పార్టీ నేతలను కాపాడుకునేందుకే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారే తప్ప పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టడం లేదని ధ్వజమెత్తారు. అంతేగాక ఓటు బ్యాంకు రాజకీయాలు సాగిస్తూ జాతీయ భద్రతనే ప్రమాదంలో పడేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించిన సందర్భంగా ఓ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు.

తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయించడం ద్వారా విజయ్ పథ్‌ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంతమాత్రం అడ్డుకోలేరని స్పష్టం చేశారు. బిజెపికి ఉన్న ప్రజా బలంతో తృణమూల్ కాంగ్రెస్ గంగలో మునిగిపోవడం ఖాయమన్నారు. కమ్యూనిస్టుల పాలన కంటే మమతా బెనర్జీ పరిపాలన అధ్వాన్నంగా ఉందన్నారు. జాతీయ భద్రతను పరిరక్షించడం కంటే మమతకు తమ ఓట్లను కాపాడుకోవడమే ముఖ్యమైందన్నారు. అందుకే బుర్ద్వాన్ అల్లర్ల కేసును సరైన విధంగా దర్యాప్తు చేయించలేదన్నారు.
ప్రజల కష్టార్జితం చిట్‌ఫండ్ నిందితుల చేతుల్లోకి పోకుండా అడ్డుకోలేక పోయారని అమిత్ షా విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజల కోసం ఎలాంటి పోరాటానికైనా తమ పార్టీ సిద్ధంగా ఉందని, అందుకు పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పని చేస్తారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి, ప్రగతి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో చేయాలనుకున్నా అందుకు మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎంత మాత్రం అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు.
రాష్ట్ర రాజకీయాల్లో పరివర్తన తీసుకురావడానికి ఇదే మంచి తరుణమని, అందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు నిరంతరం శ్రమించాలన్నారు. నరేంద్ర మోడీ సారధ్యంలో దేశం అభివృద్థి పథంలో పరుగులు పెడుతూంటే మమత సారథ్యంలో రాష్ట్రం తిరోగమన పథంలోనే నడుస్తోందన్నారు. ఇటీవల కాలంలో అనేక పరిశ్రమలు రాష్ట్రంలో మూత పడ్డాయని, ఫలితంగా నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు.












Click it and Unblock the Notifications