నరేంద్ర మోడీ ప్లస్‌లు: రాహుల్ గాంధీ మైనస్‌లు
న్యూఢిల్లీ: ఇటీవల నాలుగు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించగా.. ఢిల్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించింది భారతీయ జనతా పార్టీ. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ పార్టీ స్థితి గతులపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో స్పష్టం కనిస్తపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా కొనసాగుతున్న ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభావం ఈ ఎన్నికల్లో ఏ మాత్రం చూపకపోవడం పార్టీకి కొంత ప్రతికూల అంశంగానే కనిపిస్తోంది. నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీకి మధ్య పోటీ లేదని, దీటైన అభ్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దించాల్సిన అవసరం ఉందని, లేదా బిజెపిని కట్టడి చేసేందుకు కాంగ్రెస్ కొత్త వ్యూహాలేమైనా రచించాల్సిన అవసరం ఉందని ఈ ఫలితాల వల్ల తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ప్రచారం చేసిన ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బిజెపికి మెజార్టీ స్థానాలు దక్కాయి. మూడు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి రాగా... ఢిల్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే అదే సమయంలో రాహుల్ గాంధీ ప్రచారం చేసిన ఆ రాష్ట్రాల్లో ఆయన ప్రభావం అంతగా లేకపోవడం గమనార్హం. రాజస్థాన్ రాష్ట్రాంలో మోడీ ప్రచారంలో చేసిన 20స్థానాల్లో 16 స్థానాలు బిజెపికి రాగా, రాహుల్ గాంధీ ప్రచారం చేసిన 8 స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలైంది. అంతేగాక రాహుల్ ప్రచారం చేసిన 8 స్థానాల్లో ఏడు స్థానాలు బిజెపి గెలుచుకుంది. అన్ని అంశాల్లోనూ మోడీ తన ఆధిపత్యాన్ని చాటుకుంటుండగా.. రాహుల్ గాంధీ వెనకబడినట్లు కనిపిస్తోంది. వారిద్దరిలో కొన్ని అంశాలను పోల్చి చూసినట్లయితే...
ఆకర్షించే ప్రసంగం
నరేంద్ర మోడీ ప్రసంగం ప్రజలను ఆలోచింప జేసేలా, ఆకర్షించే విధంగా ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు చేరగడమే కాకుండా తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మోడీ ఎంతో సమర్థతను చాటుకుంటారు. తన ప్రసంగంతో ప్రజలను తనవైపు తిప్పుకోవడం మోడీకే సాధ్యం. రాసుకుని వచ్చిన ప్రసంగాన్ని చదవడం లాంటిది కాకుండా అప్పటికప్పుడే తన ప్రసంగాన్ని మొదలుపెట్టి ప్రజలను ఆలోచింపజేస్తారు మోడీ.
అదే సమయంలో రాహుల్ గాంధీ ప్రసంగం అంత ఆకర్షవంతంగా లేకపోవడం, ప్రతీ ప్రసంగంలో వాడిన అంశాలనే మళ్లీ వాడడం జరుగుతోంది. ఆచరణలో సాధ్యం గానీ అంశాలు, ఆకట్టుకోలేని విషయాలను ఎంచుకుని ప్రసంగం చేయడం వల్ల రాహుల్ ప్రజలను ఎక్కువగా తనవైపు తిప్పుకోలేకపోతున్నారు.
హావాభావాలు
మోడీని చూస్తేనే ఒక గంభీరమైన వదనంతో నిండైన విగ్రహంలా కనిపిస్తారు. ప్రసంగం మధ్యలో స్వరాన్ని పెంచడం, తగ్గించడం లాంటి హావా భావాలను వ్యక్తం చేయడం ద్వారా తమతోనే మాట్లాడుతున్నారని ప్రజలు భావించేలా చేయడంలో మోడీ సఫలీకృతమవుతున్నారు. అంతేగాక వ్యంగ్యం, చమక్కులు, చమత్కారాలు కలగలుపుతూ ఓ కథలా ప్రసంగిస్తూ.. ప్రజలను మధ్య మధ్యలో ఉత్తేజితులను కలిగించేలా ప్రశ్నలను సంధించడం లాంటి మోడీ ప్రసంగంలో చెప్పుకోదగిన అంశాలు.
కాగా రాహుల్ అందంగా ఉన్నప్పటికీ హావాభావాలు వ్యక్తం చేయడంలో, ప్రసంగాన్ని ఆకర్షవంతంగా రూపొందించుకోవడం, అందుకు తగ్గట్లుగా తన ప్రసంగాన్ని కొనసాగించడం లాంటి అంశాల్లో ఆయన కొంత వరకు విఫలమవుతున్నారనే చెప్పాలి. తన ప్రసంగం జనాకర్షకంగా లేకపోవడం వల్ల రాహుల్ నిర్వహించే సభలకు హాజరయ్యేందుకు జనాలు అంత ఆసక్తి చూపనట్లే తెలుస్తోంది.
అంశాలపై అవగాహన
నరేంద్ర మోడీ ఎక్కడికెళితే అక్కడి స్థానికాంశాలను తెలుసుకుని వాటిపై ప్రజలను కదిలించే వాఖ్యలు చేయడం, వారి ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రసంగించడంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు స్థానికాంశాలతోపాటు తెలుగు ప్రజలు, నందమూరి తారక రామారావులపై వ్యాఖ్యలు చేసి ఇక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు.
రాహుల్ గాంధీకి స్థానికాంశాలపై అవగాహన తక్కవనే తెలుస్తోంది. దీంతో ఆయన ఎక్కడికెళ్లినా తనకు తెలిసిన అంశాలనే ప్రస్తావించడం, తన కుటుంబ త్యాగాలు, ఇందిరా గాంధీ దారుణ హత్య లాంటి అంశాలపై భావోద్వేగంతో మాట్లాడి ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ప్రతీ సమావేశంలో ఈ అంశాలనే ప్రస్తావించడంతో వినేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపనట్లే కనిపిస్తోంది.
యువతలో ఆకర్షణ
రాహుల్‌తో పోల్చితే మోడీ వయస్సులో పెద్ద వారైనప్పటికీ దేశ యువతకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా యువతరాన్ని ఆకట్టుకోవడంలో సఫలీకృతం అవుతున్నారు. సంప్రదాయ దుస్తులే ధరించినా.. నవతరానికి కూడా నప్పేలా నడుచుకోవడం, పదునైనా మాటలు, ఎక్కడా ఆ.. ఊ.. అంటూ తడబాటులేకుండా మాటల కోసం వెతుక్కోని నిండైన ఠీవి. ఇవన్నీ దేశాన్ని ఆయనవైపు తిప్పుకుంటున్నాయి.
రాహుల్ ఇంకా పరిణతి చెందిన రాజకీయ నాయకుడిలా కనిపించకపోవడం కొంత లోపంగానే తెలుస్తోంది. నవ్వితే బుగ్గలు సొట్ట బోయే అందం.. జీన్స్, టీషర్ట్స్, లాల్చీలు ధరించడం, నడకలో వేగం ఉన్నప్పటికీ యువతను ఆకట్టుకోవడంలో రాహుల్ వెనకబడినట్లే కనిపిస్తోంది.
అనుభవం
గుజరాత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన అనుభవం నరేంద్ర మోడీకి ఉంది. రాజకీయ పరంగా, పరిపాలన పరంగా ఎంతో నేర్పును కలిగిన మోడీ గుజరాత్‌లా దేశాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పుకోగలగడం మోడీకి అదనపు బలంగా చెప్పవచ్చు.
రాహుల్‌కు వారసత్వమే బలం. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ పార్టీపై పూర్తిస్థాయిలో పట్టులేకపోవడం, పార్టీని ముందుండి నడిపించలేకపోవడం లాంటి అంశాలు ప్రజల్లో ఆయన ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి.
దూకుడు
మోడీ తన ప్రసంగంలో ఎంతో దూకుడును ప్రదర్శిస్తారు. ప్రత్యర్థులపై నిప్పులు కురిపించడంలో ఎలాంటి తడబాటు ఉండదు. ప్రసంగంలో ఇబ్బందులను తనకు అనుకూలంగా మార్చుకుని జనాలను ఆకర్షించడంలో మోడీ ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు.
రాహుల్ గాంధీకి రాజకీయ అనుభవం కొంత తక్కువగా ఉండడం వల్ల తన ప్రసంగాన్ని అంత దూకుడుగా కొనసాగించలేకపోతున్నారు. అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమవుతుండడంతో తన దూకుడును కొంత తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆధునిక సాంకేతికత
నరేంద్ర మోడీ వయస్సులో అర్థ శతకం పూర్తి చేసినప్పటికీ ఆధునికత సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఎంతో ముందున్నారు. కుర్రకారుతో పోటీ పడుతూ ట్విట్టర్, బ్లాగుల్లో ఎప్పుడూ తన ప్రచారాన్ని కొనసాగించుకుంటున్నారు. తన ప్రచారంలోనూ, బిగ్ స్ర్కీన్లు, త్రీడి, హాంగౌట్ ఇంటర్వ్యూలు లాంటి ఆధునిక వేదికలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం మోడీకే సాధ్యమైంది.
అదే సమయంలో యువ నేత రాహుల్ టెక్నాలజీని అంతగా ఉపయోగించుకోకపోవడం గమనార్హం. యువతను ఉద్దేశించి చేసే ప్రసంగాలు కూడా తక్కువే. రాహుల్ ట్విట్టర్‌లో ఉన్నారో లేరో తెలియదు.












Click it and Unblock the Notifications