వినేష్ ఫొగట్‌కు టఫ్ ఫైట్
Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్.. సంచలనాలకు తెర తీశారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. రెజ్లింగ్ రింగ్ నుంచి ఎన్నికల బరిలో దిగారు. సహచర రెజ్లర్ బజరంగ్ పునియాతో కలిసి రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకొన్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచారు. కాంగ్రెస్.. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న స్థానం ఇది. 2005 తరువాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవలేదు. 2009, 2014 ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ ఇక్కడ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ తరఫున పర్మిందర్ సింగ్ ధుల్.. గెలిచారు. ప్రస్తుతం ఈ పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది.

2019 నాటి ఎన్నికల్లో జులానా నియోజకవర్గంలో జన్‌నాయక్ జనతా పార్టీ పాగా వేసింది. ఆ పార్టీ తరఫున అమర్‌జీత్ ధండా ఇక్కడ విజయం సాధించారు. ఈ పార్టీ కూడా బీజేపీతో పొత్తులో కొనసాగుతోంది. ఈ కారణంతోనే ఇక్కడ అభ్యర్థిని నిలపలేదు బీజేపీ. పొత్తులో భాగంగా జేజేపీకే వదిలివేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్‌జీత్‌కే టికెట్ ఇచ్చింది జేజేపీ.
సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ గెలుపు ముఖం చూడని నియోజకవర్గం జులానా నుంచి ఆ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు వినేష్ ఫొగట్. ఈ ఉదయం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, తన అభిమానులతో కలిసి హోమాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వినేష్ ఫొగట్ విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజలు, స్థానికుల అండదండలతో ఇన్ని రోజులూ రెజ్లింగ్‌లో చిరస్మరణీయమైన విజయాలను సాధించానని, ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో కూడా వాళ్ల ఆశీర్వాద బలంతో గెలుస్తానని అన్నారు. దేవుడి దయ, పెద్దల ఆశీర్వాద బలం లేకపోతే ఏమీ సాధించలేమని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు కూడా ప్రజల ఆశీర్వాదం బలంతో ఎన్నికల్లో ముందడుగు వేస్తాననే విశ్వాసం తనకు ఉందని వినేష్ ఫొగట్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎప్పటిలాగే తనకు మద్దతు ఇస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications