పోలీస్ స్టేషన్‌లోనే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ: ఉత్తమ్ సహా: కేంద్రంపై కౌంటర్ అటాక్
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ ఇవ్వాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమె ఈడీ ముందుకు విచారణకు హాజరు కావడం ఇది రెండోసారి. ఇదివరకు ఆమెను ఈడీ అధికారులు విచారించారు. మరోసారి రావాల్సి ఉంటుందంటూ సమన్లను జారీ చేయడంతో ఈ ఉదయం దేశ రాజధానిలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

నిరసనలతో అట్టుడికిన రాష్ట్రాలు..
దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రదర్శనలను నిర్వహించారు. ఆందోళనలకు దిగారు. రోడ్లపై బైఠాయించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల హింసాత్మక రూపు దాల్చాయి. ప్రభుత్వ ఆస్తులపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడికి దిగినట్లు వార్తలు అందుతున్నాయి. పలు చోట్ల కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ అయ్యారు.

ఢిల్లీలోనూ ఉద్రిక్తత..
దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ విచారణకు హాజరు కావడానికి సోనియా గాంధీ 10, జన్‌పథ్ నివాసం నుంచి బయలుదేరిన వెంటనే కాంగ్రెస్ నాయకులు రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు సైతం నిరసన ప్రదర్శనలను చేపట్టారు. పార్లమెంట్ భవనం నుంచి ర్యాలీగా విజయ్ చౌక్‌కు తరలి వెళ్లారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గె, రాహుల్ గాంధీ ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ సహా..
ఇదే ర్యాలీలో పాల్గొన్న పలువురు ఎంపీలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్న కారణంగా అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అరెస్టయిన వారిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత, అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గె, జైరామ్ రమేష్, కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగొయ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హరీష్ రావత్, పవన్ ఖేరా, పవన్ బన్సల్, అల్కాలంబా ఉన్నారు.

పోలీస్ స్టేషన్‌లోనే సమావేశం..
అరెస్టయిన నాయకులందరినీ కింగ్స్‌వే క్యాంప్ పోలీస్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. దీనితో అక్కడికక్కడే రాహుల్ గాంధీ.. పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, ఆహార వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం వంటి అంశాలపై చర్చించారు. వివాదాస్పదమైన అగ్నిపథ్ పథకం, జాతీయ భద్రత, దేశ సరిహద్దుల్లో దూకుడుగా చైనాను అడ్డుకోవడం కేంద్ర ప్రభుత్వం విఫలం కావడం, రూపాయి విలువ దారుణంగా పతనం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

కేంద్రంపై ఎదురుదాడికి..
ఈ సందర్భంగా పలువురు ఎంపీలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. బియ్యం, గోధుమలు, పాలు, పెరుగు, మజ్జిగ వంటి నిత్యావసర సరుకుల మీద కూడా జీఎస్టీ విధించడం పట్ల దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఉమ్మడి పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ సభ్యుడి సహకారాన్ని తీసుకుందామని మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించారు.

దేశవ్యప్తంగా వ్యతిరేకత..
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్యులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారని, జీఎస్టీని ఆహార ధాన్యాలకు కూడా వర్తింపజేయడాన్ని భరించట్లేదని అన్నారు. వీటి ఆధారంగా కేంద్రంపై ఎదురుదాడి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీనికి అవసరమైన భవిషత్య కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాల్సి ఉందని పేర్కొన్నారు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించడాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications