విద్యార్ధులకు సంఘీభావంగా కాంగ్రెస్ కీలక పిలుపు-రేపు దేశవ్యాప్తంగా..!
నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిరాకరిస్తున్న వేళ ఢిల్లీ జంతర్ మంతర్ లో సాగుతున్న విద్యార్ధుల ఆందోళనలు ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. ఇదే క్రమంలో విద్యార్దులకు మద్దతుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు, సామాజిక వేత్తలు, సంస్ధలు నిరసనలు చేపడుతున్నాయి. ఇదే క్రమంలో రేపు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసనలకు కాంగ్రెస్ పార్టీ (Congress) పిలుపునిచ్చింది.
నీట్-సీబీఎస్‌ఈ అంశాలపై రేపు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు, సత్యాగ్రహాలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. విద్యార్థులకు మద్దతుగా జిల్లా స్థాయిలో కొవ్వొత్తుల ర్యాలీలు, సత్యాగ్రహాలు నిర్వహించాలని కాంగ్రెస్ తమ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలకు (PCCs) ఆదేశాలు జారీ చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ విడుదల చేసిన సర్క్యులర్‌లో జూలై 25 శనివారం సాయంత్రం ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కొవ్వొత్తుల ర్యాలీ, సత్యాగ్రహం నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమాలన్నీ మహాత్మా గాంధీ లేదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద ముగిసేలా చూడాలని పేర్కొన్నారు. నీట్-సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించిన అక్రమాలు, విద్యార్థులపై జరిగిన ఘటనలకు నిరసనగా, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కాంగ్రెస్ ఈ కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. అలాగే పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ ఆందోళనల్లో రాష్ట్ర, జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు, పార్టీ అనుబంధ విభాగాలు, కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, పౌర సమాజ ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. ఈ కార్యక్రమాలను శాంతియుతంగా, క్రమశిక్షణతో, సమర్థవంతంగా నిర్వహించాలని పీసీసీ అధ్యక్షులకు సూచించారు.












Click it and Unblock the Notifications