అసెంబ్లీ రిజల్ట్స్‌పై రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదీ: పాఠం నేర్చుకున్నాం
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టాయి. ఏ రాష్ట్రంలో కూడా ఆ పార్టీకి ఆశించిన సీట్లు రాలేదు. అధికారం కాదు కదా.. కనీసం ప్రతిపక్ష స్థానానికి అవసరమైనన్ని సీట్లను కూడా దక్కించుకోలేకపోయింది హస్తం పార్టీ. ఉన్నంతలో గోవాలో మాత్రమే ఫర్వాలేదనిపించుకుంది. కంచుకోటగా ఉంటూ వచ్చిన పంజాబ్‌ను పోగొట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఇది ఊహించని పరాభవం. చావుదెబ్బతో సమానం.
Recommended Video
ఉత్తర ప్రదేశ్‌లో నామమాత్రంగా కూడా ప్రభావాన్ని చూపలేకపోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభంజనానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ వచ్చిన సమాజ్‌వాది పార్టీనే చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. మూడు లేదా నాలుగుకు మించి అధిక స్థానాలను దక్కించుకోలేకపోవచ్చు కాంగ్రెస్. ఉత్తరాఖండ్‌లో గట్టిపోటీ ఇస్తుందని భావించినప్పటికీ- వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. బీజేపీ ఏకపక్ష విజయాన్ని అందుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని దాటేసింది.

పంజాబ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ రెండు చోట్లా ఓడిపోయారంటే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్‌లోనూ ఇదే పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అభ్యర్థి హరీష్ రావత్ ఘోరంగా ఓడిపోయారు. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ దూకుడు ముందు నిలవలేకపోయింది. భారీగా ఆశలు పెట్టుకున్న గోవాలోనూ కాంగ్రెస్ గట్టెక్కలేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా అక్కడ ఫలితాలు వెలువడ్డాయి.
ఈ పరిణామాలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. ప్రజల తీర్పును శిరసా వహిస్తామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి శుభాకాంక్షలు చెబుతున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాల నుంచి పాఠాన్ని నేర్చుకుంటామని అన్నారు.












Click it and Unblock the Notifications