ప్రధాని: రాహుల్ అభ్యర్థిత్వంపై ప్రకటన డౌట్, ఇప్పుడైతే
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించి భారతీయ జనతా పార్టీ దూకుడుగా ఉండగా కాంగ్రెసు పార్టీ మాత్రం తర్జన భర్జన పడుతోంది. శుక్రవారం నాటి ఏఐసిసి సమావేశంలో రాహుల్ గాంధీని మోడీకి ప్రత్యర్థిగా యూపిఏ ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెసు ప్రకటిస్తుందని అందరు భావించారు. కానీ, ఆ ప్రకటన ఇప్పుడు ఉండే అవకాశం కనిపించడం లేదు. పాలనపై ప్రజల అసంతృప్తి, పెరిగిన ధరలు, అవినీతి వంటి అంశాలు కుదిపేస్తున్న సమయంలో రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట.
ప్రభుత్వ వ్యతిరేకత దృష్ట్యా పార్టీ ఓడిపోతే రాహుల్‌కు అది కోలుకోలేని దెబ్బ అవుతుందని భావిస్తున్నారు. ఈ కారణంగా ఆయనను ప్రధాని అభ్యర్థిగా కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లేదా ఎన్నికల ప్రచార సారథిగా మాత్రమే పగ్గాలు అప్పగించాలని సీనియర్ నేతలు సూచిస్తున్నారట. అంతేకాకుండా కాంగ్రెసుకు మొదటి నుండి ప్రధాని అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం లేదని గుర్తు చేస్తున్నారు.

అయితే పార్టీ ఏ పని అప్పగించినా చేసేందుకు సిద్ధమేనని రాహుల్ గాంధీ చెబుతున్నారు. ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు తాను సిద్ధమేనని ఆయన పరోక్షంగా సూచించినట్లు భావిస్తున్నారు. అయితే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ మాత్రం రాహుల్‌ను కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకూడదని కుండబద్దల కొట్టినట్లు చెబుతున్నారట.
రాహుల్ ప్రధాన మంత్రి అభ్యర్థిత్వంపై దిగ్విజయ్ ఇంత గట్టిగా మాట్లాడటం అంటే పార్టీ అధినాయకత్వం స్థాయిలో ఈ అంశంపై చర్చ జరిగే ఉంటుందని, ఈ చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకే రాహుల్ అభ్యర్థిత్వాన్ని దిగ్విజయ్ వ్యతిరేకిస్తున్నారని భావించవలసి ఉంటుందంటున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సభ్యులు తమ నాయకుడిని ఎన్నుకోవటం ఆనవాయితీగా వస్తోందని, ఇందుకు భిన్నంగా రాహుల్‌ను ధాని అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. తమ నాయకుడిని ఎంచుకునే ఎంపీల హక్కులను హరించటం మంచిది కాదని ఆయన వాదిస్తున్నారు.
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడటం వలన పార్టీ ప్రతిష్ఠ బాగా దెబ్బతిన్నదని, లోక్‌సభ ఎన్నికల్లో కూడా పార్టీకి పరాజయం ఎదురవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించటం రాజకీయ విజ్ఞత అనిపించుకోదని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
‘రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినాయకుడు. ఆయన నాయకత్వంలోనే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటాం. అయితే ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారా? లేదా? అనేది ఏఐసిసిలోనే స్పష్టమవుతుంది' అని దిగ్విజయ్ చెప్పారు. ఏఐసిసిలో ఏం జరుగుతుందనేది ఇప్పుడే చెప్పటం మంచిది కాదన్నారు. అయితే, ఫలితం ఎలా ఉన్నా రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని వాదించే వారు కూడా లేకపోలేదు.
కాగా, రెండు రోజుల క్రితం ఓ హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ.. తాను కాంగ్రెసు సిపాయినని, తనకెలాంటి ఆదేశమిస్తే దానిని శిరసావహిస్తానని, కాంగ్రెసు ఏం చేయమంటే అది చేస్తానని, తమ పార్టీలో సీనియర్లు నిర్ణయాలు తీసుకుంటారన్నారు.












Click it and Unblock the Notifications