బీహార్ కు వరాలిచ్చి ఏపీని వదిలేశారు.. బడ్జెట్ పై కాంగ్రెస్ ఫైర్..!
ఇవాళ పార్లమెంట్ లో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఇది బీహార్ బడ్జెటా లేక భారత దేశ బడ్జెటా అని బీజేపీని ప్రశ్నించింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, మనీష్ తివారీ కేంద్ర బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్డీయేలో కీలక భాగస్వాములైన రెండు రాష్ట్రాల పట్ల కేంద్రం ఇలా ద్వంద విధానాలు అవలంబించడం ఏంటని ప్రశ్నించారు.
బీహార్‌కు "బొనాంజా" లభించిందని, ఆంధ్రప్రదేశ్‌ను క్రూరంగా విస్మరించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ ఆరోపించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేలో జేడీయూ, టీడీపీ కీలకంగా ఉన్నా ఎన్నికల దృష్టితో బీహార్ కు ఒక్కటే లబ్ది కలిగేలా కేటాయింపులు చేసారని, ఆంధ్రాను విస్మరించారని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. సంవత్సరం తరువాత అక్కడ కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ఆర్థిక వ్యవస్థ నాలుగు సంక్షోభాలతో బాధపడుతోందని, అందులో స్థిరమైన వాస్తవ వేతనాలు, సామూహిక వినియోగంలో పెరుగుదల లేకపోవడం, ప్రైవేట్ పెట్టుబడుల మందగమనం, సంక్లిష్టమైన జీఎస్టీ వ్యవస్థ ఉన్నాయన్నారు. ఈ సమస్యలు పరిష్కరించడానికి బడ్జెట్ ఏమీ చేయలేదన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఉపశమనం ఇచ్చారన్నారు.
ఇది ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలన్నారు. మరో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కూడా బడ్జెట్ పై విమర్శలు చేశారు. తనకు బడ్జెట్ అర్ధం కాలేదన్నారు. ఇది భారత ప్రభుత్వ బడ్జెట్‌నా లేదా బీహార్ ప్రభుత్వ బడ్జెట్‌నా? అని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రసంగం మొత్తంలో వేరే రాష్ట్రం పేరు విన్నారా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications