ఛాయ్‌వాలాకు రూ.2లక్షలు బాకీపడ్డ కాంగ్రెస్..
ముంబైలోని ఓ టీ స్టాల్ యజమానికి కాంగ్రెస్ పార్టీ రూ.4లక్షలు బకాయి పడింది.
ముంబై: ఓ టీ స్టాల్ యజమానికి కాంగ్రెస్ పార్టీ రూ.2లక్షలు బాకీ పడింది. మొత్తం రూ.4లక్షల బాకీలో ఈమధ్యే రూ.2లక్షలు చెల్లించగా.. మరో రూ.2లక్షలు ఇంకా చెల్లించాల్సి ఉంది. అయితే పార్టీపై తనకు నమ్మకముందని, తన బాకీని కాంగ్రెస్ పార్టీ త్వరలోనే తీరుస్తుందని సదరు టీ స్టాల్ యజమాని ధీమాగా చెబుతున్నాడు.
ముంబైలోని ఆజాద్ మైదాన్ సమీపంలో ఉన్న ముంబై రీజనల్ కాంగ్రెస్ కమిటీ(ఎంఆర్‌సీసీ) ప్రధాన కార్యాలయంలో పరిస్థితి ఇది. ఈ కార్యాలయాన్ని ఆనుకుని పక్కన్నే ఇందర్ జోషి అనే వ్యక్తి టీ స్టాల్ నడుపుతున్నాడు. జోషి తయారుచేసే టీ అంటే అమితంగా ఇష్టపడే కాంగ్రెస్ నాయకులు.. పార్టీ మీటింగ్ లకు, నేతలతో సమావేశాలకు జోషినే టీ సప్లై చేస్తున్నాడు.

దీంతో జోషి టీ స్టాల్ లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఓ ఖాతానే తెరిచింది. కార్యాలయానికి వచ్చే ప్రతీ ఒక్కరికి ఇక్కడినుంచే టీ సప్లై అయ్యేది. అలా కాంగ్రెస్ పార్టీ రూ.4లక్షల బిల్లు జోషి టీ స్టాల్ కు బకాయి పడింది. చాలారోజుల నుంచి జోషి పార్టీ వర్గాలను బిల్లు గురించి అడుగుతూ వస్తుండగా.. ఇటీవలే రూ.2లక్షలు కాంగ్రెస్ పార్టీ చెల్లించింది.
దీనిపై ఎంఆర్‌సీసీ అధ్యక్షుడు నిరుపమ్ స్పందించారు. జోషికి డబ్బులు బాకీ పడిన మాట వాస్తవమేనని చెప్పారు. కొద్ది రోజుల క్రితమే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, కార్యాలయ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని పేర్కొన్నారు. బకాయిని త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీ స్టాల్ యజమాని జోషి కూడా కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం వ్యక్తం చేశారు. బకాయిపడ్డ రూ.2లక్షలను పార్టీ త్వరలోనే తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications