దేశ అంతర్గత భద్రతపై సోనియా గాంధీ ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో అంతర్గత భద్రత సమస్య చాలా తీవ్రంగా ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యాలు చేశారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి కారణంగా దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఉగ్రదాడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ ఆస్తులపైనా, అందులో నివసిస్తున్న అధికారుల కుటుంబాల సంక్షేమంపైనా సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఉగ్రవాదులను అణచివేసి, పౌరుల రక్షణకోసం ఆస్తుల భద్రతకోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సోమవారం పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఆమె నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

జైషే అహ్మద్ ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో వీరమరణం పొందిన సిబ్బంది ధైర్యసాహసాలను ఆమె కొనియాడారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో భూకంప బాధితులకు సత్వరం సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈశాన్య రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలందరినీ ఆమె ఈ మేరకు ఆదేశించారు.
సహాయ చర్యల్ని వేగంగా చేపట్టేందుకు అవసరమైతే పార్టీ బృందాల్ని ఉపయోగించుకోవాలని ఆమె వారికి సూచించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. సోమవారం ఉదయం ఈశాన్య రాష్ట్రాల్ని భూకంపం కుదిపేసిన సంఘటనపై సోనియా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారని ఆ ప్రకటన పేర్కొంది.
కాగా శనివారం అర్థరాత్రి గాలింపు చర్యల సందర్భంగా జరిగిన బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడి ఎన్‌ఎస్‌జి (నేషనల్ సెక్యూరిటీ గార్డు) దళానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్, మరో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందడంతో మొత్తం సైనిక మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది.
మరోపక్క పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కాగా పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ పూర్తి అయింది. కొద్దిసేపటి క్రితం ఆరో ఉగ్రవాదిని భద్రతాదళాలు కాల్చిచంపినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.












Click it and Unblock the Notifications