కర్ణాటక ఎన్నికల్లో 141 సీట్లు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: డీకే శివకుమార్
కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నువ్వా నేనా అన్నట్టు అధికార,ప్రతిపక్ష పార్టీలు కర్ణాటక ఎన్నికలలో ఓటర్ల మద్దతును పొందేందుకు ప్రయత్నం చేశారు. ఈరోజు అందరిలోనూ ఓటరు దేవుళ్ల తీర్పు ఎటువైపు ఉంటుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం 224 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 2613మంది అభ్యర్థులు నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నారు. త్రిముఖపోరు సాగుతున్న కర్ణాటకలో ఈ సారి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుంది అన్నది అన్ని రాజకీయ పార్టీలలో ఆసక్తిగా మారింది. కర్ణాటక ఎన్నికలవైపు మొత్తం దేశమే చూస్తుంది. ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసే ముందు వివిధ పార్టీల నేతలు గుడిలో పూజలు చేయించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కనకపుర అభ్యర్థి డీకే శివకుమార్ సైతం రాంనగర్లోని కనకపురలోని శ్రీ కేంకేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.డీకే శివకుమార్ తో పాటు,ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ కూడా పూజలలో పాల్గొన్నారు. అనంతరం వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడిన కనకపుర అభ్యర్థి డీకే శివకుమార్ ఈ సారి ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్పు కోసం ఓటు వేయడానికి యువ ఓటర్లకు ఇది మంచి అవకాశమని డీకే శివకుమార్ పేర్కొన్నారు.బీజేపీ పాలనలో ధరల పెరుగుదల గురించి అందరికీ తెలుసనీ, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకునే ఓటు వేస్తారన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ధరల పెరుగుదల వల్ల పడిన కష్టాలు, అవినీతి గురించి వారికి తెలుసని అందుకే మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని తాను అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈసారి 141 సీట్లు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తమకు నమ్మకముందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications