బాలికపై రేప్ యత్నం: ప్రతిఘటించడంతో భవనంపై నుంచి తోసేసిన పోలీసు
బదాయూ: మూడు రోజుల క్రితం మైనర్ బాలికను ఓ కానిస్టేబుల్ పోలీసు స్టేషన్ భవనంపై నుంచి తోసేసిన సంఘటనలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో జనవరి 15న ఉజాహని పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
17 ఏళ్ల బాలిక ట్యూషన్‌కు వెళ్తుండగా పిలిచి కానిస్టేబుల్ అత్యాచారానికి యత్నించాడని, ప్రతిఘటించిన ఆమెను భవనం మీది నుంచి తోసేశాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తీవ్ర గాయాలుపాలైన ఆ బాలిక ప్రస్తుతం బరేలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడైన గౌరవ్ టెట్లర్ అనే కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి, అరెస్టు చేసినట్లు వారు పేర్కొన్నారు. బాలికకు స్పృహ రాగానే ఆమె దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా వార్తల్లో నిలిచే జిల్లాగా బదాయూ పేరుగాంచింది. కొన్ని రోజుల క్రితం ఇటీవలే ఇదే జిల్లాలో14 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన మరువక ముందే మళ్లీ ఇదే సంఘటన పునరావృతం కావడం విశేషం.
గత ఏడాది మే నెల్లో ఇదే జిల్లాలో ఇద్దరు టీనేజీ అమ్మాయిలు ఒక చెట్టుకి ఉరితీయబడిన సంఘటన దేశం వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఇద్దరు టీనేజీ అమ్మాయిలు అత్యాచారం చేయబడి ఉరితీయబడ్డారని పోలీసులు తమ నివేదికలో పేర్కొనగా... సీబీఐ మాత్రం వారు ఆత్మహత్య చేసుకున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి గత ఏడాది డిసెంబర్‌లో నివేదికను సమర్పించింది.












Click it and Unblock the Notifications