ద రెడ్ శారీ: సోనియాపై వివాదాస్పద పుస్తకం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జీవిత చరిత్రకు కల్పన జోడించి స్పెయిన్ రచయిత జేవియర్ మోరో రాసిన వివాదాస్పద ‘ఎల్ సారీ రోజో' పుస్తకం ఎట్టకేలకు భారత మార్కెట్లో ‘రెడ్ శారీ' పేరిట విడుదలవుతోంది. ఇందులోని అంశాలపై కాంగ్రెస్ పార్టీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేయడంతో దేశంలో ఈ పుస్తకాన్ని ఎవరూ ప్రచురించలేదు.
స్పానిష్ భాషలో తొలుత 2008లో విడుదలైన ఈ పుస్తకంలో అభూతకల్పనలు, అర్ధ సత్యాలు, పరువునష్టం కలిగించే అంశాలు ఉన్నాయని ఆరోపిస్తూ సోనియా తరఫు న్యాయవాదులు 2010లో మోరోకు లీగల్ నోటీసు పంపారు. సోనియా ఆప్తమిత్రులు, సహచరుల నుంచి సేకరించిన సమాచారాన్ని మోరో ఈ పుస్తకంలో పొందుపరిచారు.

సోనియా బాల్యం, రాజీవ్‌గాంధీతో ప్రేమాయణం, ఇందిరాగాంధీ కోడలు కావడం, ప్రధాని అవకాశాన్ని తిరస్కరించడం వంటి అంశాలను ఇందులో స్పృశించారు. అయితే ఈ ఏడాది ప్రచురణకర్త ఆ పుస్తకాన్ని భారత మార్కెట్లోకి తేవాలని అనుకుంటున్నారు. భారతదేశంలో ప్రభుత్వం మారిన తర్వాత తాము సోనియా గాంధీ న్యాయవాదులకు లేఖ రాశామని, దాన్ని అచ్చు వేయాలని కోరుకుంటున్నారా అని అడిగామని, అందుకు వారు అంగీకరించారని రోలీ బుక్స్ ప్రమోద్ కపూర్ చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ద రెడ్ సారీలో వివాదాస్పద విషయం గురించి యుకె టెలిగ్రాఫ్ రాసింది. 1991లో తన భర్త రాజీవ్ గాంధీ హత్యానంతరం సోనియా గాంధీ ఇండియాను వదిలిపెట్టిపోవాలని భావించినట్లు ఆ పుస్తకంలో ఉందని ఆ పత్రిక రాసింది. జేవియర్ మోరో పుస్తకాలకు ఇటలీలోనూ స్పెయిన్‌లోనూ విపరీతమైన గిరాకీ ఉంది.












Click it and Unblock the Notifications