సోనియాపై ఇటలీ టు భారత్ 'ది రెడ్ శారీ': బెదిరించారన్న రచయిత
న్యూఢిల్లీ: తాను రాసిన ది రెడ్ శారీ పుస్తకంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కించపరచలేదని ఆ పుస్తకం రచయిత జేవియర్ మోరో చెప్పారు. తన పుస్తకంలో సోనియాపై తాను ఎలాంటి దుష్ప్రచారం చేయలేదన్నారు. కేవలం ప్రజా సంబంధాలు తెలియని కొందరు కాంగ్రెస్‌లో ఉండడమే ఈ పుస్తకంపై వ్యతిరేకతకు కారణమైందన్నారు.
ఈ పుస్తకంలో ఇటలీలోని ఒక మధ్యతరగతి మహిళ, భారత్‌కు చేరుకుని ప్రపంచంలో కొద్దిమంది శక్తిమంతులైన వారి జాబితాలో ఎలా చేరిందనేది వివరించామన్నారు. యూపీఏ హయాంలో విడుదల చేయలేని ఈ పుస్తకాన్ని ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం ప్రచురిస్తున్నామని రోలి బుక్స్ అధినేత ప్రమోద్ కపూర్ తెలిపారు.
సోనియా జీవిత ఘట్టాల పైన తాను పుస్తకం రాశానని తనకు అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయని, 2010లో పుస్తకం విడుదలయ్యాక బెదిరింపులు వచ్చాయని జేవియర్ మోరో చెప్పారు. కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ, మరికొందరు నేతలు తన పైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించారన్నారు.

పుస్తకంలో అర్ధసత్యాలు, కించపరిచే వ్యాఖ్యలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారని, ఈ పుస్తకాన్ని భారత్‌లో విడుదల చేయవద్దని స్పెయిన్‌లోని ప్రచురణకర్తల పైన ఒత్తిడి తెచ్చారన్నారు. నెహ్రూ - గాంధీ కుటుంబం గురించి ఎప్పటి నుండో తాను వింటున్నానని, అందుకే సోనియాపై పుస్తకం రచించే పనిని 2004లో మొదలు పెట్టానన్నారు.
2008లో స్పానిష్‌లో ఇది ప్రచురితమైందన్నారు. ఇది రాజకీయపరమైన కథ కాదన్నారు. ఇటలీకి చెందిన ఓ సాధారణ అమ్మాయి భారత్ వచ్చి అత్యంత శక్తిమంతమైన మహిళగా ఎదిగిన క్రమాన్ని వివరించానని చెప్పారు. సోనియా లేదా కాంగ్రెస్ నేతలు తనను కలిసేందుకు ఇష్టపడలేదన్నారు.
ఇటలీ వెళ్లి పరిశోధన చేసి, అనేకమంది ఇతరులను కలిసి ఆ వివరాలతో పుస్తకం రూపొందించానని, ఒక్కసారి ప్రియాంక గాంధీని కలిశానని జేవియర్ చెప్పారు. ఈ పుస్తకాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోందో వారినే అడగాలన్నారు.
కాగా, తాను జైలులో ఉండగా జవహర్ లాల్ నెహ్రూ ఒక గులాబీ రంగు చీరను తన కుమార్తె ఇందిర కోసం నేశారని, ఆ చీరను ఇందిర తర్వాత సోనియా, ప్రియాంకలు కూడా తమ వివాహ సమయంలో కట్టుకున్నారని, ఆ పింక్ శారీనే రెడ్ శారీ అని పేరు మార్చి తన నవలకు మోరో పేరు పెట్టారంటున్నారు.












Click it and Unblock the Notifications