ముంబైలో 30 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ .. 28 మంది పూర్తిగా వ్యాక్సిన్లు తీసుకున్నా సరే !!
మహారాష్ట్రలోని ముంబైలో ఎంబిబిఎస్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం రేపింది. మొత్తం 30 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది . కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో 28 మంది కరోనా నియంత్రణ కోసం రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నారు. అయినప్పటికీ వారికి కరోనా పాజిటివ్ గా నమోదుకావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది .
మహారాష్ట్రలో 30 మంది వైద్య విద్యార్థులకు కరోనా .. వారిలో 28 మంది వ్యాక్సిన్లు తీసుకున్నవారే
మహారాష్ట్రలోని ముంబై పురపాలక ఆధ్వర్యంలో ఉన్న కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (KEM) హాస్పిటల్‌లో 30 మంది విద్యార్థులు కోవిడ్-19 కి పాజిటివ్ పరీక్షించారు. వీరిలో 28 మంది విద్యార్థులు కరోనా మహమ్మారి కి వ్యతిరేకంగా పూర్తిగా టీకాలు తీసుకున్నారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విద్యార్థులలో, 23 మంది రెండవ సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్థులు కాగా, ఏడుగురు మొదటి సంవత్సరంలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఇద్దరు విద్యార్థులను చికిత్స కోసం నగరంలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో చేర్పించారు.

లక్షణాలు లేని కరోనా బాధితులు.. కళాశాలలో మొత్తం 1,100 విద్యార్థులు
ఎలాంటి కరోనా లక్షణాలు లేని ఇతర విద్యార్థులను క్వారంటైన్‌లో ఉండాలని కోరారు. కళాశాల నుండి మొత్తం 1,100 మంది విద్యార్థులు ఎం బి బి ఎస్ కోర్సును అభ్యసిస్తున్నారు. పరీక్షించిన 30 మంది విద్యార్థులందరూ కోవిడ్ బారిన పడ్డారని కేఈఎం హాస్పిటల్ డీన్ డాక్టర్ హేమంత్ దేశ్‌ముఖ్ తెలిపారు. ఇక ఈ కాలేజ్ లో ప్రతిరోజూ 200-250 కోవిడ్ పరీక్షలు నిర్వహించబడుతుండగా, తాజాగా 30 మంది విద్యార్థులు కరోనా బారిన పడడంతో కళాశాల ఇతర విద్యార్థులకు కూడా ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వైద్య విద్యార్థులకు సోకిన వేరియంట్ పై పరిశోధన
ఇక కరోనా సోకిన విద్యార్థులు వ్యాక్సినేషన్ తీసుకున్నవారు కావడంతో, వారికి సోకిన వేరియంట్ పై అధ్యయనం జరుగుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్ వారికి సోకినట్లు గా అనుమానిస్తున్న అధికార యంత్రాంగం నిర్ధారణ కోసం పరిశోధన చేస్తోంది. కరోనావైరస్ కేసులు తగ్గడం మరియు టీకాలు వేగం పెరగడంతో అనేక కళాశాలలు మరియు పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఏదేమైనా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇటీవల చాలామంది విద్యార్థులు కోవిడ్ పాజిటివ్ పరీక్షించిన కేసులు బయటపడ్డాయి.
ఇటీవల కర్ణాటక స్కూల్ లోనూ కరోనా కేసులు
ఈ వారం, కర్ణాటకలోని బెంగుళూరులోనూ ఓ స్కూల్ లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక రెసిడెన్షియల్ స్కూల్ లో దాదాపు 500 మంది విద్యార్థులలో 60 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ తరువాత ఆ ప్రాంతం కరోనా క్లస్టర్ గా మారింది. 60 మంది పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో ఇద్దరు మాత్రమే లక్షణాలతో ఉన్నట్లు గుర్తించారు. అక్టోబర్ 20 వరకు పాఠశాల మూసివేసి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిని క్వారంటైన్ చేశారు.
వ్యాక్సిన్లు తీసుకున్నా జాగ్రత్తలు అవసరం
కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్నా కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని, సామాజిక దూర నిబంధనలు అవలంబించాలని పదేపదే ప్రభుత్వం గుర్తు చేస్తుంది. వ్యాక్సినేషన్ కరోనా రాకుండా ఆపలేదని, వ్యాక్సినేషన్ వల్ల కరోనాతీవ్రత తగ్గుతుందని , మరణానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈ విషయం వ్యాక్సిన్లు తీసుకున్న వారు గుర్తు పెట్టుకోవాలని నిత్యం చెప్తూనే ఉంది. చాలా మంది వ్యాక్సిన్లు తీసుకున్నాం అన్న ధీమాలో మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. సామాజిక దూరం పాటించటం, చేతులు శానిటైజ్ చేసుకోవటం కూడా మానేశారు. ఫలితంగా వ్యాక్సిన్లు తీసుకున్నా కరోనా సోకుతుంది.












Click it and Unblock the Notifications