వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా సెకండ్ వేవ్: తెలంగాణలో మృతుల సంఖ్యలో తేడాలకు శ్మశానాలే సాక్ష్యాలా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య ఎంత అనే విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ లెక్కలకూ, క్షేత్ర స్థాయిలో పరిస్థితికీ పొంతన లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో అసలు శ్మశానాల దగ్గర పరిస్థితి ఎలా ఉంది అని బీబీసీ తెలుసుకునే ప్రయత్నం చేసింది.

Coronavirus deaths

ప్రస్తుతం హైదరాబాద్‌లో అధికారికంగా కరోనా మృతులకు మూడు శ్మశానాల్లోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. బన్సీలాల్ పేట, ఈఎస్ఐ, అంబరుపేట. కానీ, మరికొన్ని ప్రాంతాల్లో కూడా అనధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంది. అయితే, ఈ మూడు శ్మశానాల్లో కూడా పదుల సంఖ్యలో అంత్యక్రియలు జరుగుతున్నాయి.

ఇక్కడ మామూలు రోజుల కంటే మూడింతలు ఎక్కువగా మృతదేహాలు వస్తున్నాయి. తాము గతంలో ఎప్పుడూ ఒకేసారి ఇన్ని శవాలు రావడం చూడలేదని అక్కడ పనిచేసేవారు చెబుతున్నారు.

''మా ఆస్పత్రి నుంచి రోజూ సగటున 50కి పైగా మృతదేహాలు తీసుకుని అంబులెన్సులు వెళ్తున్నాయి.'' అని గాంధీ ఆసుపత్రి సిబ్బంది ఒకర చెప్పారు.

వాస్తవానికి, ఆయన చెబుతున్న లెక్కకూ ప్రభుత్వ గణాంకాలకు పోలిక లేదు. ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం ఏప్రిల్ 27న మొత్తం తెలంగాణలో 53 మంది చనిపోయారు. కానీ ఒక్క ఈఎస్ఐ శ్మశాన వాటికలోనే రోజూ సగటున 40కి పైగా శవాలను దహనం చేస్తున్నారు. ఇక మిగతా వాటికల్లో జరిగే అంత్యక్రియలు, ముస్లిం, క్రైస్తవ శ్మశానాల్లో ఖననాలు వాటికి అదనం.

''నేను ఏప్రిల్ 20న ఈఎస్ఐ శ్మశానం దగ్గరకు వెళ్లాను. అక్కడ ఆ రోజు 40కి పైగా మృతదేహాలు కాలడం స్వయంగా చూశాను'' అని ఒక జీహెచ్ఎంసీ ఉద్యోగి బీబీసీకి చెప్పారు.

అంతిమ సంస్కారాల వ్యయం పెరిగింది

ప్రస్తుతం హైదరాబాద్‌లో అంత్యక్రియలకు అయ్యే వ్యయం కూడా పెరిగింది. మామూలు రోజుల్లో శవాన్ని తీసుకెళ్లే వాహనానికి, అంత్యక్రియలకు మొత్తం కలిపి 10 వేల రూపాయలు అయ్యేది. ఇప్పుడు వాటికి 25 నుంచి 35 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు.

ముఖ్యంగా అంబులెన్స్ లేదా మృతదేహాన్ని తీసుకెళ్లే వాహనాలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో మామూలు రోజుల్లో కంటే డబుల్ అడుగుతున్నారు. ఇక కట్టెలు. శ్మశానాల దగ్గర నిర్వాహకులకూ ఇచ్చే మొత్తం కూడా బాగా పెరిగింది.

''మామూలు రోజుల్లో బన్సీలాల్‌ పేట శ్మశానం దగ్గర అంత్యక్రియలకు రూ.6 వేలు లేదంటే ఎక్కువగా రూ.10 వేలు అయ్యేది. కానీ ఇప్పుడు ఏకంగా రూ.25 వేల వరకూ తీసుకుంటున్నారు. కోవిడ్ మృతదేహాల తాకిడి వల్లే ఇలా జరుగుతోంది'' అని ఒక స్థానిక మీడియా ప్రతినిధి చెప్పారు.

మరోవైపు కోవిడ్ మొదటి వేవ్‌లో కరోనా మృతుల అంత్యక్రియల ఖర్చును జీహెచ్ఎంసీనే భరించేది. కానీ ఇప్పుడు అది ఆర్థిక సాయం చేయడం లేదు.

శవ దహనానికి స్లాట్ బుకింగ్

ప్రస్తుతం కోవిడ్ మృతదేహాలు శ్మశానాలకు భారీగా వస్తుండడంతో, స్లాట్ బుక్ చేసుకునే పద్ధతి ఏర్పాటు చేశారు.

ఫోన్ ద్వారా లేదా నేరుగా ముందే స్లాట్ బుక్ చేసుకున్నవారు, శ్మశాన నిర్వాహకులు చెప్పిన సమయానికి శవం తీసుకురావాల్సి ఉంటుంది.

అప్పటికప్పుడు వచ్చి అంత్యక్రియలు చేయాలంటే, కుదరదని వారు కచ్చితంగా చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో ఉదయం, సాయంత్రం మాత్రమే అంత్యక్రియలు జరుగుతున్నాయి.

ఇక్కడ శవదహనాలు వద్దు

సికింద్రాబాద్‌లోని అరుణ్ జ్యోతి కాలనీ వాసులకు కొత్త సమస్య ఎదురయ్యింది. ఆ కాలనీకి దగ్గర్లో ఒక విద్యుత్ శ్మశాన వాటిక ఉంది. అక్కడ శవాలను దహనం చేస్తుంటే వచ్చే బూడిద, వాసన తమ ఇళ్ల వరకూ వస్తున్నాయని వారు ఆందోళనక దిగారు. కాలనీ వాసులు కొందరు వీధుల్లోకి వచ్చి అంత్యక్రియలకు వ్యతిరేకంగా నిరసనలు కూడా చేశారు. అయినా, ప్రస్తుతం అక్కడ అంత్యక్రియలు కొనసాగుతూనే ఉన్నాయి.

మరోవైపు, పది రోజుల క్రితమే జీహెచ్ఎంసీ మూసాపేట దగ్గర ఒక కొత్త గ్యాస్ ఆధారిత దహనవాటికను ప్రారంభించింది. త్వరలో ఇలాంటివి మరికొన్ని ప్రారంభించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.

అయితే, మృతదేహాల లెక్కలకూ, ప్రభుత్వ గణాంకాల మధ్య ఉన్న తేడాపై స్పందించాలని బీబీసీ తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌ను సంప్రదించింది. ఆయనింకా స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Corona Second Wave: Are cemeteries evidence of differences in death toll in Telangana?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X