వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: ముక్కులో నిమ్మరసం పిండితే ఆక్సిజన్ అందుతుందా.. కర్పూరం, వాము, నెబులైజర్ చిట్కాలు పనిచేస్తాయా - Fact Check

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భారత్‌లో ఆక్సిజన్ కొరత

కరోనా సెకండ్ వేవ్ భారత ఆరోగ్య వ్యవస్థను కుదిపేస్తోంది. భారీ సంఖ్యలో ఉన్న రోగులకు సత్వర చికిత్స అవసరం అవుతోంది.

ఫలితంగా విధిలేని పరిస్థితుల్లో జనం రకరకాల చిట్కాలు ఉపయోగించి చూడాల్సి వస్తోంది.

ఇంటర్‌నెట్, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ కొందరు చాలా ప్రమాదకరమైన పద్ధతుల ద్వారా జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఉదాహరణకు ఆక్సిజన్ శాచురేషన్ లెవల్ పెంచడానికి అసలు ఏమాత్రం పని చేయని వంటింటి చిట్కాలు కూడా చెబుతున్నారు.

నెబులైజర్

నెబులైజర్‌తో ఆక్సిజన్ అందుతుందా

ఒకవైపు దేశంలో మెడికల్ ఆక్సిజన్ దొరక్క జనం అల్లాడిపోతుంటే మరోవైపు తనను డాక్టర్‌గా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా షేర్ అవుతోంది.

తనను డాక్టర్‌గా చెప్పుకుంటున్న ఆయన ఈ వీడియోలో నెబులైజర్ ఆక్సిజన్ సిలిండర్‌లా పనిచేస్తుందని అంటున్నారు.

నెబులైజర్ అంటే శ్వాస పీల్చుకోవడం ద్వారా ఔషధాన్ని రోగి శరీరంలోకి పంపించే ఒక పరికరం. ఔషధం ఒక ఆవిరిలా మారినప్పుడు, రోగి దానిని శ్వాస ద్వారా పీల్చుకుంటాడు.

ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌లో షేర్ అవుతున్న ఈ వీడియోలో ఆయన దాన్ని ఎలా ఉపయోగించాలో హిందీలో చెప్పడం కనిపిస్తుంది.

"మన వాతావరణంలో తగినంత ఆక్సిజన్ ఉంది. ఈ నెబులైజర్ దానిని మన శరీరంలోకి పంపగలదు. ఆక్సిజన్ లాగడానికి మీకు ఒక నెబులైజర్ ఉంటే చాలు" అని ఆయన చెబుతుంటారు.

ఆ పోస్ట్‌లో హాస్పిటల్ పేరు కూడా ఇచ్చారు. అది దిల్లీకి దగ్గరగా ఉంది. కానీ, ఇప్పుడు ఆయన మాట మార్చారు.

"నెబులైజర్ నుంచి ఆక్సిజన్ అందుతుంది అనే వాదనలకు ఎలాంటి ప్రమాణాలు, శాస్త్రీయ అధ్యయనాలు లేవు" అని ఆయన చెప్పారు.

అదనపు ఆక్సిజన్‌ను అందించడానికి ఈ టెక్నిక్ అసలు పనిచేయదని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.

డాక్టరుగా చెబుతున్న వ్యక్తి వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, ఆయన మరో వీడియో కూడా విడుదల చేశారు.

అందులో ఆయన తన సందేశాన్ని ప్రజలు అపార్థం చేసుకున్నారని.. నెబులైజర్‌ను ఆక్సిజన్ సిలిండర్ స్థానంలో ఉపయోగించవచ్చు అని చెప్పడం తన ఉద్దేశం కాదని అన్నారు.

అయితే, ఆయన మొదట చెప్పిన నెబులైజర్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికీ షేర్ అవుతూనే ఉంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఒక ప్రసంగంలో ఈ వీడియో స్క్రీన్ షాట్ కూడా చూపించారు. డాక్టర్లు ఫోన్, వాట్సాప్ ద్వారా రోగులకు మందుల గురించి సలహాలు, సూచనలు ఇస్తున్నారని చెప్పడానికి ఆయన ఈ స్క్రీన్ షాట్ చూపించారు. అయితే ఆయన తన ప్రసంగంలో ఈ వీడియో, ఆడియో ఉపయోగించలేదు.

మూలికలతో ఆక్సిజన్ స్థాయి పెరగదు

భారత సోషల్ మీడియా ప్లాట్‌పాంలలో కోవిడ్-19 చికిత్స గురించి చెబుతూ ఇటీవల ఆక్సిజన్ లెవల్ పెంచుతాయంటూ వంటింటి చిట్కాలు కూడా వెల్లువెత్తాయి.

ఇంటర్‌నెట్, చాట్ ఫ్లాట్‌ఫాంలలో ఈ చిట్కాలు జోరుగా షేర్ అయ్యాయి. వాటిలో కర్పూరం, వాము, నీలగిరి తైలం మిశ్రమం కోవిడ్ రోగుల్లో ఆక్సిజన్ లెవల్ పెంచడానికి చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు.

కానీ, ఈ మిశ్రమం వల్ల కోవిడ్-19 రోగులకు ఏదైనా ప్రయోజనం కలిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

సంప్రదాయ ఆయుర్వేద ఔషధాన్ని ప్రమోట్ చేస్తూ ఒక డాక్టర్ పెట్టిన ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో 23 వేల సార్లు షేర్ చేశారు. ఈ వీడియో వాట్సాప్‌లో కూడా జోరుగా షేర్ అవుతోంది.

ఇక వాస్తవం ఏంటంటే, సాధారణంగా స్కిన్ క్రీమ్, లేపనంలా ఉపయోగించే కర్పూరంను శరీరం లోపలికి తీసుకోవడం ప్రాణాంతకం కావచ్చు.

కర్పూరం ఆవిరి శరీరంలోపల విషపూరితం కాగలదని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెచ్చరించింది.

విజయ్ సంకేశ్వర్ వాదన గురించి వార్త

నిమ్మరసం కరోనాకు మందు కాదు

ఒక సీనియర్ నేత, పారిశ్రామిక వేత్త ఇటీవల ముక్కులో రెండు చుక్కల నిమ్మ రసం వేసుకుంటే శరీరంలో ఆక్సిజన్ శాచురేషన్ లెవల్ పెరుగుతుందని చెప్పారు.

"ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్న తన సహచరులకు ఈ చిట్కా పాటించమని చెప్పాను. అది చేశాక వారి ఆక్సిజన్ లెవల్ 88 శాతం నుంచి 96 శాతానికి చేరింది" అని విజయ్ సంకేశ్వర్ అనే ఆయన చెప్పారు.

"ఈ చిట్కాతో భారత్‌లో 80 శాతం ఆక్సిజన్ సమస్య తీరిపోతుందని" కూడా ఆయన అన్నారు.

కానీ ఆక్సిజన్ లెవల్ పెంచడానికి ఈ చిట్కా పనిచేస్తుందని కూడా ఎలాంటి ప్రామాణికతా లేదు.

యోగా గురు రాందేవ్ చిట్కాలు

భారత్‌కు చెందిన ప్రముఖ యోగా గురు రాందేవ్ కూడా ఈ మధ్య "ఇంట్లో కూర్చునే ఆక్సిజన్ లెవల్ పెంచుకునే పద్ధతుల" గురించి వార్తా చానళ్లలో, తన యూట్యూబ్ చానల్ వీడియోల్లో చెబుతూ కనిపిస్తున్నారు.

ఆ వీడియోలో ఆయన "దేశమంతా ఆక్సిజన్ కోసం అల్లాడిపోతున్నారు" అంటారు.

తన వేలికి ఒక ఆక్సిజన్ లెవల్ కనుగొనే డివైస్ పెట్టుకుంటున్న బాబా "మీకు ఒక అద్భుతం చూపిస్తున్నాను" అంటారు.

బాబా రాందేవ్ ఆసనాలు

ఆ తర్వాత ఆయన శ్వాసకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేసి చూపిస్తారు. ఒక ఆసనంలో కూర్చున్న రాందేవ్ మొదట కొంత సేపు శ్వాసను ఆపుతారు. తన ఆక్సిజన్ లెవల్ సురక్షిత స్థాయి కంటే దిగువకు పడిపోతున్నట్లు చూపిస్తారు.

ఆ తర్వాత ఆయన "ఆక్సిజన్ పడిపోవడానికి 20 సెకన్లు పడుతుంది. రెండు సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి. మీ రక్తంలో ఆక్సిజన్ దానికదే వచ్చేస్తుంది" ఎందుకంటే మన వాతావరణంలో తగినంత ఆక్సిజన్ ఉంది అంటారు.

సాధారణంగా యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, "కోవిడ్-19 లాంటి సమస్య వల్ల శరీరంలో ఆక్సిజన్ శాచురేషన్ లెవల్ తగ్గిపోయినప్పుడు, దానిని బయటి నుంచే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే, సప్లిమెంటల్ మెడికల్ ఆక్సిజన్ అవసరమవుతుంది" అని డబ్ల్యుహెచ్ఓ చెబుతోంది.

"రోగి శరీరంలో ఆక్సిజన్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు, ఆ పరిస్థితి ఎక్కువ సమయం కొనసాగితే, దానికి తగిన చికిత్స అందకపోతే, శరీరంలోని కణాలు తమకుతాముగా పనిచేయడం ఆగిపోతుంది. ఆ పరిస్థితిలో కేవలం మెడికల్ ఆక్సిజన్ మాత్రమే ప్రాణాలు కాపాడగలదు" అని డబ్ల్యుహెచ్ఓ డాక్టర్ జెనెట్ డియాజ్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Corona: Squeezing lemon juice in the nose gets oxygen Do camphor, thyme and nebulizer tips work
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X