కరోనా లాక్‌డౌన్: ఒడిశా, పంజాబ్ తర్వాత రాజస్థాన్, ఏప్రిల్ 30వరకు, ఉమ్మివేయడంపై కూడా బ్యాన్..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు వైరస్ సోకిన వారి సంఖ్య పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కూడా లాన్ డౌన్ పొడిగించాలని భావిస్తోంది. అయితే కొన్ని సడలింపులు చేసే అవకాశం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ప్రధాని మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్ పొడగిస్తూ వస్తున్నాయి. తొలుత ఒడిశా లాక్ డౌన్ పొడిగించగా.. తర్వాత పంజాబ్ ప్రభుత్వం కూడా డిసిషన్ తీసుకున్నది. ఇదే బాటలో రాజస్థాన్ కూడా చేరింది.

రాజస్థాన్ కూడా
ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని రాజస్థాన్ ప్రభుత్వం స్పష్టంచేసింది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 98 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 561కి చేరుకున్నది. వైరస్‌ను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ కొనసాగించాలని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. శుక్రవారం జైపూర్ ఆస్పత్రిలో వృద్దురాలు చనిపోవడంతో మృతుల సంఖ్య కూడా ఎనిమిదికి చేరింది.

ఉమ్మివేయడంపై కూడా..
శుక్రవారం పారిశ్రామికవేత్తలు, వ్యాపారులతో సీఎం గెహ్లాట్ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. వైరస్ వ్యాప్తి చెందుతున్నందున నిర్ణయం తీసుకోబోతున్నామని వరాకి చెప్పారు. దీంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడంపై నిషేధం విధించింది. పాన్/గుట్కా వేసుకొన్న, వేసుకొకున్నా ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయొద్దని తెలిపింది. ఆదేశాలను ధిక్కరిసతే ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జైపూర్‌లోనే ఎక్కువ..
శుక్రవారం నమోదైన 98 పాజిటివ్ కేసుల్లో 8 మంది ఇరాన్ నుంచి వచ్చినవారేనని రాజస్థాన్ అధికారులు పేర్కొన్నారు. 53 కేసులు రాజధాని జైపూర్‌లో నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. బాన్స్‌వారాలో 12, జోధ్ పూర్ 9, జై సల్మేర్ 8, ఝాలావర్ మూడు, కోటా రెండు, అల్వార్, భారత్ పూర్, దౌసాలో ఒక్కొక్కరికి వైరస్ సోకింది. మరోవైపు ఒడిశా ప్రభుత్వం పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారు, వాహనదారులు విధిగా మాస్క్ వేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్రంలో బయటకు వస్తోన్న ప్రతీ పౌరుడు విధిగా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications