కరోనా ఎఫెక్ట్: ఆఫీసులకు రావొద్దు.. ఉద్యోగులకు కంపెనీల ఆదేశం..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా విలయం చూపిన ప్రభావంపై ఇంకా లెక్కలు తేలకముందే.. దిగ్గజ టెక్ సంస్థలు కూడా వైరస్ ఎఫెక్ట్ కు గురికావడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తున్న కారణంగా ప్రఖ్యాత టెక్ కంపెనీలన్నీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ముఖ్యమైన ఈవెంట్లను వాయిదా వేసుకున్న సంస్థలు.. ఉద్యోగుల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్ కు చెందిన టెకీ.. కంపెనీ పనిమీదే దుబాయ్ వెళ్లి వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.
కరోనా భయాల నేపథ్యంలో ఉద్యోగులెవరూ ఆఫీసుకు రావొద్దని.. ఎక్కడివాళ్లు అక్కడే ఇంటి నుంచి పనిచేయాలని(వర్క్ ఫ్రమ్ హోం) ప్రఖ్యాత గూగుల్, ట్విటర్, కాయిన్ బేస్ సహా పలు టెక్ సంస్థలు ఆదేశాలు జారీచేశాయి. ఉత్తర్వులు యూరప్ వరకే వర్తిస్తాయని గూగుల్ పేర్కొనగా, ట్విటర్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులందరూ ఇంటివద్ద నుంచే పనిచేయాలంటూ ఆదేశించినట్లుతెలుస్తోంది. తూర్పు ఆసియా దేశాలకు సంబంధించి ఇదివరకే అవి జాగ్రత్తలు తీసుకున్నాయి.

యూరప్ ఖండంలో గూగుల్ సంస్థ ప్రధానకార్యాలయం డబ్లిన్(ఐర్లాండ్)లో ఉంది. అక్కడ 8వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో ఓ ఉద్యోగికి ఫ్లూ లక్షణాలు కనిపించడంతో సంస్థ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే ట్విటర్, క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజి కంపెనీ కాయిన్‌బేస్ తోపాటు మరికొన్ని కంపెనీలు కూడా ఉద్యోగుల్ని ఆఫీసులకు రావొద్దని, ఇళ్లలో ఉండే పనిచేయాలని ఆదేశించాయి.
దాదాపు అన్ని ఖండాలకు విస్తరించిన కరోనా వైరస్ ధాటికి ఇప్పటిదాకా 3,100 మంది చనిపోయారు. లక్షమందికి పాజిటివ్ తేలిసింది. చైనా, దాని పక్కనే ఉన్న సౌత్ కొరికాలో తీవ్ర ప్రభావం ఉండగా, యూరప్ లోనూ రోజురోజుకూ మరణాలు పెరిగిపోతున్నాయి. మంగళవారం నాటికి ఇండియాలోనూ కరోనా బాధితుల సంఖ్య పెరిగింది.












Click it and Unblock the Notifications