CorroHealth layoffs: తక్షణమే లాగ్ అవుట్ చేసి వెళ్లిపోండి.. ఆఫీస్ ఎత్తేశాం.. రోడ్డున పడ్డ 800 మంది..!
అక్కడి వాతావరణం చూస్తే ఎవరికైనా షాకింగ్ గా అనిపిస్తుంది.. మండుటెండలో వందలాది మంది ఉద్యోగులు పడిగాపులు కాస్తున్నారు. వారిలో గర్భిణిలు, మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. తమను ఆఫీస్ లోకి అనుమతి ఇవ్వాలని వాళ్లంతా డిమాండ్ చేస్తున్నారు. కానీ యాజమాన్యం మాత్రం అవేమీ పట్టించుకోకుండా వారిని గెంటేసింది. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కొచ్చి, కోజికోడ్ నగరాల్లోని కోరోహెల్త్ అనే అమెరికాకు చెందిన కార్యాలయాల వద్ద నెలకొంది. ఆ కంపెనీ మాస్ లేఆఫ్స్ ప్రకటించడంతో ఈ ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక్క రోజులోనే దాదాపు 800 మంది ఉద్యోగుల్ని తొలగించడంతో ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి.
ఆ ఉద్యోగులకు తోడుగా అనేక విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, ఏఐటీయూసీ సంస్థ కోజికోడ్, కొచ్చి లోని కోరోహెల్త్ ఆఫీస్ ల వద్ద ఆందోళనలు చేపట్టాయి. మరోవైపు తమను ఆఫీస్ లోకి అనుమతించాలంటూ వందలాది మంది ఉద్యోగులు ఆఫీస్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమకు న్యాయం జరుగుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు. మరోవైపు ఇదే విషయంపై కేరళలోని లేబర్ సెక్రటరీ, లేబర్ మినిస్టర్ బిందు కృష్ణ అలాగే ఉద్యోగుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే గతంలో జరిగిన చర్చల్లో లేఆఫ్స్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కోరోహెల్త్ కంపెనీ స్పష్టం చేసినా.. తాజాగా దాదాపు 800 మందిని ఒకేసారి తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక అప్పటికే ఆఫీస్ కు వచ్చిన ఉద్యోగులను త్వరగా లాగ్ అవుట్ చేసి వెళ్లిపోవాల్సిందిగా యాజమాన్యం ఆదేశాలు ఇచ్చింది. ఆఫీస్ ఎత్తేశామని తెలిపింది. దాంతో ఆందోళన చెందిన ఉద్యోగులు ఆ ప్రాంత ఎమ్మెల్యే, ఇతర అధికారులను సంప్రదించారు. వాళ్ల సూచన మేరకు లేఆఫ్స్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పిన కోరోహెల్త్ కంపెనీ.. అలాగే లేఆఫ్స్ ప్రకటించడం ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. అలాగే ప్రతి ఉద్యోగి ఖాతాలో రెండు లేదా రెండున్నర నెలల జీతాన్ని నష్టపరిహారం కింద జమ చేస్తోంది. ఉద్యోగులు.. కంపెనీపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోకుండా కోరోహెల్త్ జాగ్రత్త పడుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications