సహజీవనం చేసినా భార్యాభర్తలుగానే గుర్తింపు, ఆస్తి ఆమెకే: సుప్రీం
న్యూఢిల్లీ: వివాహం కాకుండా ఆడ, మగ.. భార్యాభర్తలుగా దీర్ఘ కాలం సహజీవనం చేసినట్లయితే వారిని చట్టబద్ధంగా భార్యాభర్తలుగా గుర్తించడం జరుగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేగాక, ఒక వేళ సహజీవనం చేస్తున్న తన భర్త చనిపోయినట్లయితే అతని ఆస్తి ఆమెకే దక్కుతుందని పేర్కొంది.
ఒకవేళ అలా కాదు.. ఆమెకు ఆస్తి ఇవ్వకూడదనుకుంటే, వాళ్లిద్దరికీ చట్టబద్ధంగా పెళ్లికాలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ మగవాడి తరఫు పార్టీమీదే ఉంటుందని స్పష్టం చేసింది. ఎక్కువ కాలం పాటు ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి నివసిస్తుంటే వారిని భార్యాభర్తలుగానే చట్టం భావిస్తుందని జస్టిస్ ఎంవై ఇక్బాల్, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక రూలింగ్‌లో తెలిపింది.

2010 నుంచి కూడా సుప్రీంకోర్టు సహజీవనం చేస్తున్న జంటలను భార్యాభర్తలుగానే పరిగణిస్తూ వారికి అనుకూలంగానే రూలింగులు ఇస్తోంది. కాగా, ఈ రూలింగ్ ఏ సందర్భంలో వచ్చిందంటే.. తమ తాత గురించి కొందరు మనవలు, మనవరాళ్లు కలిసి వేసిన కేసు వల్లే. తమ మామ్మ చనిపోయినప్పటినుంచి.. అంటే గత 20 ఏళ్లుగా తాత వేరే మహిళతో కలిసి ఉంటున్నారని, కానీ వాళ్లు పెళ్లి చేసుకోలేదని మనవలు తెలిపారు.
ఇటీవల తాత మరణించగా.. ఆయన ఆస్తికి ఆమె వారసురాలు కారన్నది వీరు వాదించారు. కాగా, తామిద్దరికీ పెళ్లయినట్లు సదరు మహిళ నిరూపించుకోలేకపోయింది. అయితే కోర్టు మాత్రం ఆమెకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. దీర్ఘకాలంగా సహజీవనం చేస్తున్నందున వారిద్దరిని చట్టబద్ధంగా భార్యాభర్తలుగా గుర్తిస్తామని పేర్కొంది.












Click it and Unblock the Notifications