కోవాక్సిన్ టీకాలు తీసుకున్న వారు సమ్మతి పత్రంపై సంతకం .. దుష్ప్రభావం ఎదురైతే పరిహారం
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది. భారతదేశంలో అత్యవసర వినియోగానికి కేంద్ర అనుమతించిన రెండు వ్యాక్సిన్లలో ఒకటి కోవిషీల్డ్ కాగా మరొకటి కోవాక్సిన్ . కోవిషీల్డ్ స్వీకరించే వ్యక్తులు ఎలాంటి పత్రాలను, నిబంధనలను అంగీకరించాల్సిన అవసరం లేకపోగా, కోవాక్సిన్ విషయంలో మాత్రం టీకా తీసుకున్నవారు సమ్మతి పత్రంపై సంతకం చేసి షరతులు అంగీకరించాలి. ఒకవేళ టీకాలు తీసుకున్న వారికి దుష్ప్రభావాలు ఏమైనా కలిగితే, అవి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల సంభవించినట్లు తేలితే వారికి పరిహారం తో పాటుగా వైద్య సంరక్షణ ను సైతం తాము అందిస్తామని హామీ ఇస్తోంది భారత్ బయోటెక్ సంస్థ.
ఈ రోజు తాను కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవటంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటెల రాజేందర్

వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైద్య పరంగా సంరక్షణ ప్రమాణాలు
ఏదైనా తీవ్రమైన ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటే, అనారోగ్య సమస్యలు తలెత్తితే, వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఆసుపత్రిలో వైద్య పరంగా సంరక్షణ ప్రమాణాలు అందించడంతోపాటు గా, వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే దుష్పరిణామాలు ఎదురైనట్లు గా నిరూపిస్తే పరిహారాన్ని చెల్లించనున్నట్లుగా సంస్థ పేర్కొంది. ఇక ఈ పరిహారం ఎంత చెల్లించాలనేది ఐసీఎంఆర్ యొక్క సెంట్రల్ ఎథిక్స్ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపింది.
వ్యాక్సిన్ లబ్ధిదారులు మూడు పేజీల సమ్మతి పత్రంలో సంతకం చేసి కో వ్యాక్సిన్ టీకాను తీసుకోవాల్సి ఉంటుంది.

కోవాక్సిన్ యొక్క లబ్దిదారులు సమ్మతి పత్రంలో సంతకం చేయాల్సిన అవసరం
కోవిషీల్డ్ పొందే వారిలా కాకుండా కోవాక్సిన్ యొక్క లబ్దిదారులు సమ్మతి పత్రంలో సంతకం చేయాల్సిన అవసరం ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో పరిమితం చేయబడిన వినియోగం కోసం మాత్రమే ఈ వ్యాక్సిన్ కు అనుమతించారు . ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్ మోడ్ లోనే ఇవ్వబడుతుంది.
కోవాక్సిన్ టీకా డోసు తీసుకున్న తరువాత వారం రోజుల్లో జ్వరం గాని, నొప్పి గాని, శరీరం ఎరుపెక్కడం వంటి లక్షణాలు కానీ వచ్చినట్లయితే వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని, వారికి అందించే వైద్య చికిత్సలను భరించడమే కాకుండా, పరిహారం కూడా అందిస్తామని భారత్ బయోటెక్ వెల్లడించింది.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉండటమే కారణం
ఇప్పటివరకు కోవాక్సిన్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు రాలేదని చెప్తున్నారు .ప్రస్తుతం మూడవ దశలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న కోవాక్సిన్ సురక్షితమైనదని, మిగిలిన అన్ని టీకాల తో పోలిస్తే అత్యధిక డేటా తమ వద్ద ఉందని ఎవరూ, ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే సమ్మతి పత్రంపై సంతకాలు తీసుకుంటున్నాము అంటూ స్పష్టం చేశారు భారత్ బయోటెక్ వైద్య నిపుణులు.