లాక్‌డౌన్ లేనట్లే ? కేసులు పెరుగుతున్నా కేంద్రం విముఖత- నిర్ణయం రాష్ట్రాలకే..
దేశవ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రోజుకు నాలుగు లక్షలకు పైగా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మించిన మార్గం లేదని కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఢిల్లీ ఎయిమ్స్ ఛీఫ్ కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో కేంద్రం లాక్‌డౌన్‌వైపు మొగ్గు చూపుతుందన్న సంకేతాలు వెలువడ్డాయి. కానీ కేంద్రం తాజాగా ఆ నిర్ణయం తీసుకునేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా రాష్ట్రాలకే లాక్‌డౌన్ నిర్ణయం వదిలిపెట్టాలని భావిస్తోంది.

లాక్‌డౌన్‌పై కేంద్రం మల్లగుల్లాలు
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో కేంద్రానికి కూడా ఊపిరాడటం లేదు. తాను స్వయంగా లాక్‌డౌన్ విధించడమా లేక రాష్ట్రాలను ఆ దిశగా ప్రోత్సహించడమా అన్న విషయంలో కేంద్రం తర్జనభర్జనలు పడుతోంది. ఇప్పటికే కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఢిల్లీ ఎయిమ్స్ ఛీఫ్ గులేరియా, పలువురు నిపుణులు సైతం కఠినమైన లాక్‌డౌన్ విధించాల్సిందేనని కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. లేకపోతే పరిస్ధితి మరింత విషమించడం ఖాయమని తేల్చిచెప్తున్నారు. అయినా కేంద్రం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.

లాక్‌డౌన్ లేనట్లే ?
కరోనా కల్లోలం కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా లాక్‌డౌన్ విధించేందుకు మాత్రం మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. గతంలో లాక్‌డౌన్ సందర్భంగా ఎదురైన అనుభవాలే ఇందుకు కారణం. ఆర్ధిక వ్యవస్ద దారుణంగా పతనం కావడంతో పాటు రాష్ట్రాలకు కనీస సాయం అందించలేని పరిస్ధితి ఎదురైంది. దీంతో ఈసారి తాను స్వయంగా లాక్‌డౌన్ విధించేందుకు కేంద్రం ఆసక్తిగా లేదని తెలుస్తోంది. దీనికి బదులుగు రాష్ట్రాలకే లాక్‌డౌన్ నిర్ణయాన్ని వదిలేయాలని కేంద్రం భావిస్తోంది.

లాక్‌డౌన్ నిర్ణయం రాష్ట్రాలకే
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరిస్దితులను నిశితంగా గమనిస్తున్న కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న 150 జిల్లాల్లో కఠినమైన లాక్‌డౌన్ విధించాలని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. దీంతో పాటు మిగిలిన చోట్ల కూడా లాక్‌డౌన్ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని నిర్ణయించింది. కుంభమేళా సందర్భంగా భారీగా ప్రబలిన కేసుల దృష్ట్యా ఆయా జిల్లాల్లో లాక్‌డౌన్ నిర్ణయాన్ని స్ధానిక రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేశారు. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్ధితి.

లాక్‌డౌన్‌కు మొగ్గు చూపకపోవడానికి కారణాలివే
కరోనా కేసుల ప్రళయం కొనసాగుతున్నా లాక్‌డౌన్‌కు కేంద్రం మొగ్గుచూపకపోవడం వెనుక కొన్ని ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఆర్ధిక వ్యనస్ధపై ప్రభావం, నిరుద్యోగిత, వలస కార్మికులు ప్రధానమైనవి. ఈ మూడు సమస్యల కారణంగానే మరికొంతకాలం వేచిచూసే ధోరణిలో కేంద్రం ఉన్నట్లు అర్దమవుతోంది. ఈసారి లాక్‌డౌన్ విధిస్తే అది భవిష్యత్తులో రాజకీయంగా కూడా తీవ్ర ప్రభావం చూపనుందని ఎన్డీయే సర్కార్ భయపడుతోంది. గత లాక్‌డౌన్ సందర్భంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేంద్రం... ఈసారి నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలిపెట్టడం ద్వారా తాను సేఫ్ జోన్‌లో ఉండాలని కోరుకుంటోంది.












Click it and Unblock the Notifications