కాజీపేట రైల్వే హబ్.. ఇంటర్ సిటీ కోచ్ ల తయారీకి టెండర్లు, వారికి పండుగే!
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ హయాంలో కాజీపేట కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే నెక్స్ట్ జనరేషన్ ఇంటర్సిటీ రైలు కోచ్ ల తయారీ ప్రారంభం కానుంది. కాజీపేటలో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి రైలు కోచ్ ల తయారీకి నిర్ణయం తీసుకున్న రైల్వే బోర్డు చారిత్రాత్మక రైల్వే ఉత్పాదక కేంద్రంగా దీనిని మార్చనుంది.
సరికొత్త ఇంటర్సిటీ కోచ్ ల తయారీకి అంతర్జాతీయ టెండర్ లు
ఈ క్రమంలో త్వరలో ప్రారంభం కాబోతున్న కాజీపేట కర్మాగారంలో సరికొత్త ఇంటర్సిటీ కోచ్ ల తయారీ కోసం చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ త్వరలోనే అంతర్జాతీయ టెండర్లను పిలవనుంది. తెలంగాణ పారిశ్రామిక రంగానికి ముఖ్యంగా వరంగల్ జంట నగరాల అభివృద్ధికి కీలకమైన ముందడుగు వేసిన కేంద్రం నెక్స్ట్ జెన్ ఇంటర్సిటీ రైళ్ల తయారీకి నిర్ణయం తీసుకోవడంతో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మెగా రైలు తయారీ హబ్ గా మారనుంది.

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన టెస్టింగ్ ట్రాక్ల ఏర్పాటు
ఇప్పటికే 95 శాతం వరకు ప్రాజెక్టు పనులు పూర్తికాగా ఈ ప్రాజెక్టు ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. దీని తర్వాత ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ తయారీ కేంద్రం కోసం అధునాతన రోబోటిక్స్, ఆటోమేటెడ్ అసెంబ్లీ లైన్లు, మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన టెస్టింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు.
మొదటి మేడిన్ కాజీపేట రైలును పట్టాలెక్కించేలా రైల్వేశాఖ ప్రణాళిక
ఈ రైల్వే హబ్ ఏర్పాటుతో వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిసర ప్రాంతాలలోని వేలాదిమంది స్థానిక యువతకు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు, సాంకేతిక నిపుణులకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మూడువేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఒక అంచనా. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వేగవంతంగా పూర్తిచేసి రాబోయే కొద్ది సంవత్సరాలలో ఇక్కడి నుంచి మొదటి మేడిన్ కాజీపేట రైలును పట్టాలెక్కించేలా రైల్వేశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రైల్వే కారిడార్ లలో ఒకటి
కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా బ్రాండ్ ను నిలబెట్టేలా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రైల్వే కారిడార్ లలో ఒకటిగా నిలవనుంది. ఇక 521 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం అవుతున్న ఈ కోచ్ ఫ్యాక్టరీలో రాబోయే ఐదేళ్లలో కాజీపేట కేంద్రంగా దాదాపు 200 ఇంటర్‌సిటీ రైల్‌సెట్లను తయారు చెయ్యాలనే లక్ష్యం ఉంది.












Click it and Unblock the Notifications